Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు వంటి ప్రముఖులు మృతి చెందారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్‌పై తహసీల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978), కొత్త అల్లుడు (1979), కొత్తపేట రౌడీ (1980), ఏది ధర్మం ఏది న్యాయం (1982), ఉద్ధండుడు (1984), భలే తమ్ముడు (1985) తదితర చిత్రాలను సూర్యనారాయణ రాజు నిర్మించారు.
Read Also: Veera Simha Reddy: బాలయ్య ఆ ‘వన్డే’ స్టోరీని వద్దన్నారు.. గోపీచంద్ రివీల్ చేసిన సీక్రెట్
సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ కలిసి ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ, బాలకృష్ణ వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఎన్టీఆర్‌తో తీసిన అడవి రాముడు చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వీళ్లు నిర్మించిన కుమార రాజా చిత్రంలో హీరో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. అటు కొత్త అల్లుడు సినిమాలో చిరంజీవి విలన్‌గా నటించారు. సత్యనారాయణ కన్నుమూసిన తర్వాత కూడా సూర్యనారాయణ చిత్ర నిర్మాణం కొనసాగించారు. భరద్వాజ దర్శకత్వంలో ఓ సినిమా తీశారు. భరద్వాజ దర్శకత్వంలో సూర్య నారాయణరాజు నిర్మించిన చివరి చిత్రం ‘అత్తా నీ కొడుకు జాగ్రత్త’ 1997లో విడుదలైంది. కాగా సూర్యనారాయణ మృతి బాధాకరమని, నిర్మాతగా ఆయన తనదైన ముద్ర వేశారని బాలయ్య చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బాలయ్య వెల్లడించారు.