Site icon NTV Telugu

Tollywood : మరో ‘అఖండ’ (కా)రావాలి!

akhanda

akhanda

థర్డ్ వేవ్ లాక్ డౌన్ తరువాత అన్ సీజన్ అనిపిలిచే డిసెంబర్ ఫస్ట్ ఆఫ్ లో విడుదలైనా ‘అఖండ’ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇక ఇక్కడ నుంచీ తెలుగు సినిమాకు అన్నీ మంచి రోజులే. వరుస విజయాలు వస్తాయి చూడండి. లాక్ డౌన్ లో వాటిల్లిన నష్టం మొత్తం భర్తీ అయ్యేలా వరుసగా వచ్చే చిత్రాలన్నీ విజయం సాధిస్తాయని, సాధించాలని ఆ వేడుకలో పాల్గొన్న వక్తలు అభిలషించారు. గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన ‘అఖండ’ ఊహించిన దానికన్నా మిన్నగా ఘనవిజయం సాధించింది. మొదటి రెండు వారాలు దాదాపు 80 నుండి 90 శాతం ఫుల్స్ తో నడచిన ఈ చిత్రం తరువాత ‘పుష్ప’ లాంటి భారీ చిత్రం విడుదలై, ఆ సినిమా కూడా హిట్ టాక్ సంపాదించినా, తరువాత మరో మూడు వారాల పాటు గట్టిగానే కలెక్షన్స్ చూసింది. ‘అఖండ’ తరువాత వచ్చిన ‘పుష్ప’ సైతం మూడు వారాల పాటు మంచి వసూళ్ళు రాబట్టింది. ఇతర భాషల్లోనూ అలరించింది. ఆ తరువాత వచ్చిన ఏ చిత్రం కూడా వారం పాటు కనీసం 60 శాతం హౌస్ ఫుల్స్ చూడలేకపోయింది. 2022 జనవరిలో వచ్చిన సినిమాల పరిస్థితి కూడా అంతే! అదుగో హిట్టు, ఇవిగో కోట్లు అంటూ సందడి చేశాయే తప్ప, నిఖార్సయిన వసూళ్ళు చూడలేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.

ఇక ఫిబ్రవరిలో వచ్చిన సినిమాల్లో చిన్న చిత్రమైనా ‘డి.జె.టిల్లు’ మంచి వసూళ్ళనే చూసింది. ఈ సినిమా మరో వారం కూడా కలెక్షన్స్ వస్తాయనుకుంటున్న సమయంలోనే సరిగ్గా పదమూడు రోజులకే ఈ చిత్రాన్ని నిర్మించిన సంస్థనే రూపొందించిన ‘భీమ్లా నాయక్’ జనం ముందు నిలచింది. ఈ సినిమాకు కూడా ఏపీలో తగ్గిన వసూళ్ళు, ఆటలు దెబ్బ తీశాయి. అయినా పెద్ద హీరో, మరో యంగ్ హీరో కలసి నటించిన చిత్రం కాబట్టి తప్పకుండా ‘అఖండ’, ‘పుష్ప’ స్థాయిలో ఈ సినిమా కనీసం మూడు వారాలు హౌస్ ఫుల్స్ చూస్తుందని ట్రేడ్ సర్కిల్స్ భావించాయి. పైగా ఈ సినిమాకు ‘గుడ్ టాక్’ దక్కింది. అయినప్పటికీ అనూహ్యంగా ‘భీమ్లా నాయక్’ వసూళ్ళు జారిపోయాయి. మధ్యలో ఆదివారం, శివరాత్రి రోజుల్లో ఫరవాలేదనిపించాయి. ఈ నేపథ్యంలో కనీసం రెండు వారాల పాటు హౌస్ ఫుల్స్ చూసే సినిమా ఒకటి రావాలని సినీ ఫ్యాన్స్ తో పాటు, ఎగ్జిబిటర్స్ కూడా ఆశిస్తున్నారు. అందువల్ల మరో ‘అఖండ’ లాంటి చిత్రం వస్తే, ఆ తరువాత వచ్చిన సినిమాలు సైతం బాగా ఆడతాయనే సెంటిమెంట్ నూ వల్లిస్తున్నారు. మరి రాబోయే టాప్ స్టార్స్ సినిమాల్లో ‘రాధే శ్యామ్’ ఈ నెల 11న వస్తోంది. ఆ సినిమా వచ్చిన మరో రెండు వారాలకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న రానుంది. ఈ రెండు చిత్రాలలో రెండు వారాలకు పైగా హౌస్ ఫుల్స్ చూసే చిత్రం ఏదవుతుందో, లేదా అంతకు మించి ఈ సినిమాలు విజయం సాధిస్తాయేమో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూపులు సారిస్తున్నారు.

Exit mobile version