Tollywood: సెంటిమెంట్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమించడం కొత్తేమీ కాదు. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తూ అదో సెంటిమెంట్, ఇదో లక్కీ ఫిగర్ అంటూ సినీజనం కథలు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు ఆ కథలనూ పట్టుకొని పాకులాడుతూ ఉంటారు. అదంతా అందరికీ తెలిసిందే. మరి ఈ యేడాది సినీ ఫ్యాన్స్ కు తట్టిన సెంటిమెంట్ ఏందయ్యా అంటే – మన సినిమాల్లో అవి స్ట్రెయిట్ వైనా, డబ్బింగ్ వైనా ‘కె’ అనే అక్షరంతో ఉన్న టైటిల్స్ భలేగా సందడి చేశాయన్నది. ఈ సంవత్సరం ఇప్పటి దాకా అలా ‘కె’ అక్షరంతో ఆరంభమైన టైటిల్స్ ను పరిశీలిస్తే ఈ పది నెలల్లో దాదాపు 30 చిత్రాలు ఉన్నాయి. వాటిలో “కేజీఎఫ్-2, కాంతారా, కశ్మీర్ ఫైల్స్” వంటి డబ్బింగ్ మూవీస్ తో పాటు స్ట్రెయిట్ సినిమా ‘కార్తికేయ2’ కూడా మంచి విజయం సాధించింది. అందువల్ల ఈ యేడాది ‘కె’ సెంటిమెంట్ భలేగా పనిచేసిందని సినీజనం ఉవాచ.
‘కె’ లెటర్ తో ఆరంభమైన తెలుగు చిత్రాల్లో నాలుగు బంపర్ హిట్స్ సాధించాయి. మంచిదే! మరి మిగిలిన పాతికపైగా చిత్రాల సంగతేంటి? వాటిలో నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి’ పరవాలేదనిపించింది. ఇక ఈ ‘కె’ లిస్ట్ లో శ్రీకాంత్ ‘కోతలరాయుడు’, రవితేజ ‘ఖిలాడి’, రామ్ గోపాల్ వర్మ తీసిన కొండా మురళి బయోపిక్ ‘కొండా’ కూడా ఉన్నాయి. ఇవేవీ అంతగా ఆకట్టుకోలేదు. మిగిలిన వాటిలో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పల్టీలు కొట్టాయి. కాబట్టి, వాటి ఊసే అనవసరం అనిపిస్తుంది. ఇక విజయం సాధించిన నాలుగు చిత్రాల్లో ‘కార్తికేయ-2’ ఒక్కటే స్ట్రెయిట్ మూవీస్ లో బంపర్ హిట్. ఈ సినిమా హిందీ భాషలో ఉత్తరాదిని సైతం ఊపేసింది. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘ద కశ్మీరీ ఫైల్స్’ హిందీలో రూపొంది, తెలుగులోకి అనువాదమై అలరించింది. ఇక సూపర్ కలెక్షన్స్ చూసిన “కేజీఎఫ్-2, కాంతారా” రెండు సినిమాలూ కన్నడ అనువాద చిత్రాలు కావడం గమనార్హం! సినీ ఫ్యాన్స్ చెప్పినట్టు ఈ సారి విజయం సాధించిన వాటిలో ఎక్కువ చిత్రాల టైటిల్స్ ‘కె’తోనే ఆరంభమయ్యాయి. కాబట్టి, ఆ సెంటిమెంట్ ను నమ్మేద్దాం. మరి మరో అరవై ఐదు రోజుల్లో కేలండరే మారిపోనున్న నేపథ్యంలో రాబోయే చిత్రాలలో ‘కె’తో మొదలయ్యే టైటిల్ తో ఎన్ని వస్తున్నాయి? వాటిలో జనాన్ని అలరించే చిత్రం ఏదవుతుంది? అలాగే 2023లో ఏ అక్షరం సక్సెస్ సెంటిమెంట్ గా మారుతుందన్నది చూడాలి.
