Vidya Sagar: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత విద్యాసాగర్ రాజు(73) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడిగా దాదాపు 100 సినిమాల్లో నటించిన ఆయన మంచి స్టేజి ఆర్టిస్ట్. అంతేకాకుండా ప్రముఖ నటి రత్నా సాగర్ భర్త. జంధ్యాల సినిమాల్లో బామ్మ పాత్రల్లో నటించి మెప్పించిన రత్నా సాగర్ భర్త విద్యా సాగర్ అని చాలా తక్కువమందికి తెలుసు. నాటక రంగం నుంచి వెండితెరపై అడుగుపెట్టిన విద్యా సాగర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి మెప్పించారు. ఈ చదువులు మాకొద్దు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ఆయన.. రాజేంద్రుడు- గజేంద్రుడు, ఆఖరి క్షణం, మాయలోడు, స్వాతి ముత్యం, అహ నా పెళ్ళంట లాంటి చిత్రాల్లో ఎంతో మంచి పాత్రలు చేసి మెప్పించారు.
ఇక ఎన్నో సినిమాలకు కో డైరెక్టర్ గా, రచయితగా పనిచేశారు. ముఖ్యంగా జంధ్యాల సినిమాల్లో మంచి పాత్రల్లో నటించిన విద్యాసాగర్.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పక్షవాతం బారిన పడ్డారు. ఒక కాలు, ఒక చేయి పడిపోవడంతో వీల్ చైర్ కే అంకితమయ్యారు. అయినా సరే పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. ఇక గత కొద్దిరోజుల నుంచి విద్యాసాగర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నారు. ఇక చికిత్స పొందుతూనే నేటి ఉదయం ఆయన కన్నుమూశారు. విద్యాసాగర్ కు ఇద్దరు ఆడపిల్లలు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తపరుస్తున్నారు. విద్యాసాగర్ అంత్యక్రియలు సోమవారం మన్సిలాల్ పేట స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.