ఇవాళ దేశం మొత్తం మీద రెండు పదాల గురించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఒకటి ‘ద కశ్మీర్ ఫైల్స్’, రెండు ‘హిజాబ్’! కశ్మీర్ లోని హిందూ పండిట్స్ ను 1990లో అత్యంత దారుణంగా కశ్మీర్ లోయ నుండి పాక్ ప్రేరిత ఉగ్రవాదులు బయటకు పంపిన వైనాన్ని ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఇక హిజాబ్ ధారణతో విద్యాలయాలకు వెళ్తామనడం కరెక్ట్ కాదంటూ కర్నాటక హైకోర్టు తీర్పు చెప్పింది. దాంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతుంటే, ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం గురించి హిందూ అనుకూలురు, వ్యతిరేకులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
Read Also : The Kashmir Files : ప్రభుత్వం సంచలన నిర్ణయం… సినిమా చూడమంటూ హాఫ్ డే లీవ్ !
ఇది ఒక వర్గాన్ని విలన్స్ గా చూపిస్తున్న చిత్రమని కొందరంటుంటే, ‘షిండ్లర్స్ లిస్ట్’ లాంటి అద్భుత చిత్రరాజమని మరికొందరు వాదిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి చిత్రాలు మరిన్ని రావాలని చెప్పడం, ‘సత్యాన్ని సరైన మార్గంలో దేశం ముందుకు తీసుకు రావడం దేశానికి మేలు చేస్తుంద’ని బీజేపీ పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో ప్రస్తావించడంతో హిందుత్వవాదులకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. ప్రధాని ఇచ్చిన ఈ సందేశానికి అనుపమ్ ఖేర్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను తన తాతయ్య దివంగత సేథ్ శ్రీ జగదీశ్ పర్షద్ మోతీవాలేకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఓ చిన్న సినిమా ఇంత సంచలనాలకు కేంద్ర బిందువు కావడం ఇదే! వచ్చే జాతీయ సినిమా అవార్డులలోనూ ఈ చిత్రం పలు కేటగిరిలలో అవార్డులు కొల్లకొడుతుందని, మరీ ముఖ్యంగా అనుపమ్ ఖేర్ కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడం ఖాయమంటూ ‘గజల్’ శ్రీనివాస్ వంటి వారు ఇప్పటి నుండే ప్రచారం మొదలు పెట్టారు.
