Thirty Five Years For Pasivadi Pranam:
చిరంజీవికి ‘మెగాస్టార్’ అన్న ఇమేజ్ రాకపూర్వం ఆయనకు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ తోనే చిరంజీవి విజయయాత్ర మళ్ళీ పుంజుకుందని చెప్పవచ్చు. చిరంజీవికి అచ్చివచ్చిన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి నిర్దేశకత్వంలోనే ‘పసివాడి ప్రాణం’ కూడా తెరకెక్కింది. అల్లు రామలింగయ్య సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. విజయశాంతి నాయికగా నటించిన ఈ చిత్రం 1987 జూలై 23న విడుదలయి, విజయకేతనం ఎగురవేసింది. ఆ యేడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. అప్పట్లో వసూళ్ళ వర్షం కురిపించింది.
‘పసివాడి ప్రాణం’ కథ ఏమిటంటే – ఓ వ్యక్తిని చక్రవర్తి అనే ధనవంతుడు, అతని అనుచరుడు రంజిత్ హత్య చేస్తారు. అది చూసిన ఓ స్త్రీని వారు చంపేస్తారు. ఆమె కొడుకు మూగ, చెవిటి బాలుడు తప్పించుకొని వేరే చోటకు వెళతాడు. మధు అనే పెయింటర్ దగ్గరకు అనుకోకుండా చేరుకుంటాడు ఆ బాబు. మాట రాని ఆ బాబు తానెవరో చెప్పలేక పోతాడు. మధునే ఆ బాబును ‘రాజా’ అని పిలుస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మధుకు గీతా అనే అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె వసపిట్టలా వాగుతూ ఉంటుంది. ఆమెకు మధు చెంతన ఉన్న బాబు నచ్చుతాడు. ఓ రోజు ఆ బాబును చంపాలని వాళ్లమ్మను చంపిన హంతకుడు వస్తాడు. తప్పతాగి ఉన్న మధు, ఎలాగోలా లేచి బాబును రక్షిస్తాడు. బాబు కోసం ఇక తాగకూడదని నిర్ణయించుకుంటాడు మధు. ఆ బాబు మధు కొడుకు అని భావిస్తుంది గీత. ఆమెకు మధు గతం తెలుస్తుంది. తాను ప్రేమించి పెళ్ళి చేసుకున్న అమ్మాయి పెళ్ళయిన రోజునే అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిందని చెబుతాడు మధు. దాంతో మధుపై మనసు పారేసుకుంటుంది గీత. పోలీసులు మధునే బాబు వాళ్ళ కన్నతల్లిని చంపి ఉంటాడని అనుమానించి, అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో బాబును గీత దగ్గరకు తీస్తుంది. గీత తండ్రి ద్వారా ఆమె అక్క కొడుకే రాజా అని తెలుస్తుంది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవ డానికి మధు తప్పించుకుంటాడు. బాబును చంపాలని చూస్తున్న రంజిత్ ను చితక బాదుతాడు మధు. తరువాత చక్రవర్తి, అతని అనుచరులు బాబును చంపబోగా రక్షిస్తాడు. చివరకు దోషులెవరో పోలీసులకు తెలిసిపోతుంది. మధు, గీత ఒక్కటవ్వడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ సినిమాలో సుమలత, మమత, కన్నడ ప్రభాకర్, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు, జగ్గయ్య, గుమ్మడి, అల్లు రామలింగయ్య, గిరిబాబు, ప్రసాద్ బాబు, పి.జె.శర్మ ఇతర ముఖ్యపాత్రధారులు. ఇందులో చిన్నబాబు రాజాగా సుజిత నటించింది. అయితే టైటిల్ కార్డ్స్ లో మాస్టర్ సుజిత్ అని వేశారు. రఘువరన్ తెలుగులో నటించిన తొలి చిత్రమిదే, అతని అనుచరుడు రంజిత్ గా నటించిన బాబుకు కూడా ఇదే మొదటి సినిమా.
ఫాజిల్ రాసిన కథకు జంధ్యాల సంభాషణలు అందించారు. ఆచార్య ఆత్రేయ, వేటూరి రాసిన పాటలకు చక్రవర్తి బాణీలు కట్టారు.
“సత్యం శివం సుందరం…”, “ఇదేదో గోలగా ఉంది…”, “అందం శరణం గచ్ఛామి…”, “కాశ్మీరు లోయలో…కన్యాకుమారి…”, “చక్కని చుక్కల సందిట…” అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి. ముఖ్యంగా అప్పట్లో తెలుగునాట ‘బ్రేక్ డాన్స్’ హవా విశేషంగా వీస్తోంది. ఇందులోని “చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్…” పాట ఆ రోజుల్లో ఓ ఊపు ఊపేసింది. చిరంజీవి డాన్స్ కు జనం జేజేలు పలికారు. ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. నేరుగా 10 కేంద్రాలలో, షిఫ్ట్ మీద, ఉదయం ఆటలతో మరికొన్ని కేంద్రాలలో మొత్తం 30కి పైగా సెంటర్స్ లో వందరోజులు ప్రదర్శితమైంది. తిరుపతి మినీ ప్రతాప్ లో ఏకంగా 175 రోజులు 5 ఆటలతో ఆడి రికార్డ్ సృష్టించింది. అంతే కాదు, తిరుపతి, అనంతపూర్, నెల్లూరు కేంద్రాలలో రోజూ ఐదు ఆటలతో నూరు రోజులు ప్రదర్శితమయింది. 300 రోజులు నడిచిందీ చిత్రం. ఈ సినిమాను తరువాత రష్యన్ భాషలోకి అనువదించారు. రష్యాలోనూ ‘పసివాడి ప్రాణం’ ఆకట్టుకుంది.
‘పసివాడి ప్రాణం’ చిత్రానికి మాతృక మళయాళంలో మమ్ముట్టి హీరోగా రూపొందిన ‘పూవిను పుదియ పూంతెన్నాల్’ ఆధారం. ఫాజిల్ దర్శకత్వంలో రూపొందిన మళయాళ చిత్రంలో బాబును రక్షించి, హీరో కన్నుమూస్తాడు. దానిని తమిళంలో సత్యరాజ్ హీరోగా కొన్ని మార్పులు చేసి ‘పూవిళి వాసలిలె’ పేరుతో రీమేక్ చేయగా విజయం సాధించింది. దానిని అనుసరించి, తెలుగు చిత్రం తెరకెక్కింది. తరువాత కన్నడలో అంబరీశ్ తో ‘ఆపద్బాంధవ’గానూ, హిందీలో గోవింద హీరోగా ‘హత్య’ పేరుతోనూ, ఆ పై బంగ్లాదేశీలో ‘ఖోటి పురోన్’ టైటిల్ తోనూ, సింహళీస్ లో ‘వేద బరణం – వేదక్ నేహె’గానూ రూపొందింది. మళయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పసివాడిగా సుజితనే నటించడం విశేషం!