Thirty Five Years for Bala Krishna Ramu Movie : బాలకృష్ణ ‘రాము’కు 35 ఏళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thirty Five Years for Bala Krishna Ramu Movie
తమ పెద్దవారు నటించిన చిత్రాల కథలను పోలిన ఇతివృత్తాలతో వారి వారసులు నటించడం పరిపాటే! అలాగే వారి టైటిల్స్ నూ వారసులు ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. తెలుగునాట నటరత్న యన్టీఆర్ వారసుడు బాలకృష్ణ అదే తీరున సాగారు. యన్టీఆర్ ‘రాము’ 1968లో విడుదలై విజయం సాధించింది. ఆ టైటిల్ తో బాలకృష్ణ నటించిన ‘రాము’ చిత్రం 1987లో జనం ముందు నిలచింది. అయితే ఈ ‘రాము’ కథ 1962లో యన్టీఆర్ ‘ఆత్మబంధువు’ కథాంశం పోలి ఉంటుంది. యన్టీఆర్ ‘ఆత్మబంధువు’కు తమిళంలో రూపొందిన శివాజీ గణేశన్ ‘పడిక్కాద మేదై’ (1960) ఆధారం. శివాజీగణేశన్ స్వయంగా తన నటవారసుడు అని ప్రకటించిన కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘పేర్ సొల్లుమ్ పిల్లై’, అచ్చు ఈ ‘పడిక్కాద మేదై’ కథలాగే ఉంటుంది. బాలకృష్ణ ‘రాము’ ఈ ‘పేర్ సొల్లుమ్ పిల్లై’ ఆధారంగానే రూపొందింది. బాలకృష్ణ ‘రాము’ చిత్రాన్ని డి.రామానాయుడు తమ సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా వై.నాగేశ్వరరావు దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రం 1987 జూలై 31న విడుదలయి, విజయఢంకా మోగించింది.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ఈ ‘రాము’ కథ విషయానికి వస్తే – తన కుటుంబాన్ని నాశనం చేయబోయినవారిని అంతమొందించి, కోర్టులో దోషిగా నిల్చుంటాడు రాము. తాను ఎందుకు హత్య చేయవలసి వచ్చిందో వివరిస్తాడు – రాము ఓ అనాథ. ఓ పత్రికాధిపతి గాయత్రి, ఆమె భర్త రామేశం తమ పిల్లలు గిరిజ, సతీశ్, రమేశ్, జలజతో హాయిగా ఉంటారు. ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం నుండి రాము రక్షిస్తాడు. దాంతో ఆ దంపతులు రామును తమ పెద్దకొడుకుగా భావించి, పెంచి పెద్ద చేస్తారు. రాము ఆ ఇంట్లో అందరినీ తన సొంతమని భావిస్తూంటాడు. కానీ, గిరిజ భర్త గోపాలం అతడిని సతీశ్, రమేశ్ కు దూరం చేస్తూ ఉంటాడు. పనిమనిషి సీత, రాము ప్రేమించుకుంటారు. ఆ ఊళ్ళో భూపతి అనే పేరు మోసిన స్మగ్లర్ ఉంటాడు. వాడి భాగోతాన్ని గాయత్రి తన పత్రికలో ప్రచురిస్తుంది. గాయత్రి చిన్నకూతురు శైలజపై భూపతి కొడుకు ప్రదీప్ మనసు పారేసుకుంటాడు. భూపతి, గాయత్రితో సంబంధం కలుపుకోవాలని ఆశిస్తాడు. రాము, గాయత్రి ఆ సంబంధం వద్దనుకుంటారు. భూపతి, గాయత్రి పెద్దల్లుడు గోపాలంను చేరదీస్తాడు. గోపాలం తన కుయుక్తులతో సతీశ్, రమేశ్ బుర్రలు చెడగొడతాడు. ఓ పథకం ప్రకారం రామును ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. రామేశం తన ఆస్తిని మొత్తం రాముకు రాసివ్వాలని నిశ్చయిస్తాడు. రామేశంను భూపతి చంపేస్తాడు. రాము లేని ఆ ఇల్లు నరకప్రాయమవుతుంది. అంతటికీ భూపతి కారణమని తెలుసుకుంటాడు రాము. వాడి స్మగ్లింగ్ రహస్యాలను బయట పెడతాడు రాము. దాంతో పగపట్టిన భూపతి తన మనుషుల ద్వారా గాయత్రిని, ఆమె చిన్నకూతురును ఎత్తుకు వెళతాడు. రామును కూడా బంధిస్తాడు. గాయత్రి చేతులను చితక్కొడతారు భూపతి మనుషులు, అది చూసిన రాము తనను బంధించిన సంకెళ్ళు తెంచుకొని దుర్మార్గుల భరతం పడతాడు. చివరకు భూపతిని మట్టుపెడతాడు. ఈ విషయాన్నంతా కోర్టులో వివరించిన రాముకు, రెండేళ్ళు జైలు శిక్ష విధిస్తుంది కోర్టు. విడుదలై వచ్చిన రాముకు గాయత్రి, ఆమె కొడుకులు,చిన్నకూతురు స్వాగతం పలుకుతారు. రాము తాను వలచిన సీతను పెళ్ళాడి సైకిల్ పై పోతూ ఉండడంతో కథ సుఖాంతమవుతుంది.
బాలకృష్ణ రాముగా నటించిన ఈ చిత్రంలో గాయత్రిగా శారద, రామేశంగా జగ్గయ్య, సీతగా రజని నటించారు. మిగిలిన పాత్రల్లో సత్యనారాయణ, సుధాకర్, దీప, హరిప్రసాద్, భాస్కర్, చలపతిరావు, పి.యల్.నారాయణ, సుత్తివేలు. బాబు మోహన్, కె.కె.శర్మ, మాలాశ్రీ, జయమాలిని, అనురాధ, రమాప్రభ, శ్రీలక్ష్మి నటించారు. ఈ చిత్రానికి వి.సి.గుహనాథన్ కథను అందించగా, జంధ్యాల మాటలు రాశారు. అప్పలాచార్య హాస్యరచన చేశారు. వేటూరి పాటలు రాసిన ఈ చిత్రానికి ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చారు. “అనురాగాల రఘువంశంలో అందాల ఓ రాముడు…”, “వానేమి చేస్తుంది…”, “కానీ కానీ ముందు…”, “ఒంటి గంట కొట్టు…”, “దండాలమ్మా… దండాలమ్మా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఇందులో సుత్తివేలుపై చిత్రీకరించిన ‘దండాలమ్మా…’ పాట పలు పాత పాటల పేరడీగా రూపొందింది.
‘రాము’ సినిమాకు సరిగ్గా ఎనిమిది రోజుల ముందు విడుదలైన చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ మ్యూజికల్ హిట్ గా నిలచి, అప్పట్లో యువతను విశేషంగా మురిపించింది. ‘రాము’లో సంగీతం అంతగా అలరించలేక పోయిందనే చెప్పాలి. అయితే కుటుంబకథా చిత్రం కావడంతో మహిళలను విశేషంగా ఆకట్టుకుని, ‘రాము’ కూడా ఘనవిజయం సాధించడం గమనార్హం! ‘రాము’ను చూసిన నాటి ప్రేక్షకులందరూ యన్టీఆర్ ‘ఆత్మబంధువు’ను గుర్తు చేసుకున్నారు. కొన్ని కేంద్రాలలో ఈ సినిమా నడుస్తూ ఉండగానే ‘ఆత్మబంధువు’ చిత్రాన్ని రిపీట్ రన్ గా ప్రదర్శించారు. అయినా ‘రాము’ జనాన్ని ఆకట్టుకోగలిగింది. దాదాపుగా ఇదే కథను గుర్తుకు చేసేలా జూనియర్ యన్టీఆర్ తో రాజమౌళి ‘సింహాద్రి’ చిత్రాన్ని తెరకెక్కించారు. 2003లో వచ్చిన ‘సింహాద్రి’ అనూహ్య విజయం సాధించింది. ‘రాము’ నిర్మాత డి.రామానాయుడు తనయుడు వెంకటేశ్ హీరోగా ‘లక్ష్మీ’ అనే సినిమా 2006లో రూపొందింది. ఆ సినిమా కథ సైతం ఇలాగే ఉంటుంది. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని మూటకట్టుకోవడం విశేషం! ఇలా ఓ అనాథ, తనను ఆదరించిన కుటుంబం కోసం దేనికైనా సిద్ధపడడం అనే కథాంశం తరాలుగా అలరిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!