ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ
అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి
పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు వినగానే ఓ దుష్టుడు అనే భావన మన వాళ్ళలో ఉంది. అలాంటి రావణ
పదం మన సినిమా టైటిల్స్ లో చోటు సంపాదిస్తే ఏముంది? సదరు చిత్రాలూ అంతే సంగతులు అని చెప్పుకోవలసిందే! ఇటీవల రవితేజ హీరోగా రావణాసుర
అనే చిత్రం ప్రారంభమయింది. గత సంవత్సరం ‘క్రాక్
‘తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఈ సారి కూడా ఓ ఐదు చిత్రాలతో సందడి చేసే ప్రయత్నం లో ఉన్నారు. అంత స్పీడు చూపిస్తున్న రవితేజ సినిమా టైటిల్ లో రావణ
అన్న మాట చోటు చేసుకోవడం ఆయనను అభిమానించే వారికి ఆందోళన కలిగిస్తోంది.
ఎందువల్ల? గతంలో ఏయన్నార్ హీరోగా దాసరి నారాయణరావు ‘రావణుడే రాముడయితే?
‘ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో బజ్ నెలకొంది. అయితే చిత్రం విడుదలైన తరువాత పోటీ చిత్రాలముందు తుస్సుమంది. ఆ తరువాత రావు గోపాలరావు ప్రధాన పాత్రలో బాపు ‘కలియుగ రావణాసురుడు
‘అనే చిత్రం తెరకెక్కించారు. షరా మామూలే అన్నట్టు అది ఢామ్ అంది. పోనీ, అందులో రావు గోపాలరావు ప్రధాన పాత్రధారి కాబట్టి, సినిమా అంతగా ఆడలేదు అనుకుందాం. కృష్ణంరాజు, కె.రాఘవేంద్రరావు అంటేనే సూపర్ కాంబినేషన్ వారి కాంబోలో వచ్చిన ‘అమరదీపం', 'త్రిశూలం', 'బొబ్బిలి బ్రహ్మన్న
‘ చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే కృష్ణంరాజుతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘రావణబ్రహ్మ
‘ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మధ్య వచ్చిన ‘రావణలంక
‘ అనే చిత్రం పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన తెలుగునాటనే కాదు, మణిరత్నం తెరకెక్కించిన ‘రావణన్
‘ ఏమయిందో అందరికీ తెలిసిందే! ఇలా రావణ
అన్న మాట టైటిల్ లో ఉంటే ఏదో కీడు శంకిస్తున్నారు జనం. మరి ఈ సెంటిమెంట్ ను తెలిసి ‘రావణాసుర
‘ టీమ్ తమ టైటిల్ మార్చుకుంటుందా? లేక ఏమయితే ఏమయింది అని ముందుకు పోతుందా? ఒకవేళ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను ఈ ‘రావణాసుర
‘ ఏమైనా బ్రేక్ చేస్తుందా? ఏమవుతుందో చూడాలి.