ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దిన పత్రికల మాజీ సంపాదకులు, ప్రముఖ రచయిత, జాతీయవాది ఎం.వి.ఆర్. శాస్త్రి తాజాగా సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్రను ‘నేతాజీ’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. దానిని ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. అయితే ఆ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరు కావాల్సి ఉంది. కానీ అదే సమయంలో ముందుగా అంగీకరించిన కార్యక్రమం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్గొనలేదు. కానీ ఆ పుస్తకం విడుదలైన వెంటనే ఆ విషయాన్ని అప్పట్లోనే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ, ఎంవీఆర్ శాస్త్రిని అభినందించారు. ఇప్పుడు మరోసారి ఆ పుస్తకం పట్ల, రచయిత పట్ల తనకున్న గౌరవాన్ని పవన్ కళ్యాణ్ చాటిచెప్పబోతున్నారు.
ఎంవీఆర్ శాస్త్రి రాసిన ‘నేతాజీ’ గ్రంధ సమీక్షా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్సీ ఈ నెల 24వ తేదీ సాయంత్రం 6 గంటలకు మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతోంది. ‘నేతాజీ’ పుస్తకాన్ని ఈ వేదికపై ప్రముఖ సినీ రచయిత సత్యానంద్, ఆంధ్రప్రభ దిన పత్రిక సంపాదకులు వైయస్ఆర్ శర్మ, భగవద్గీత ఫౌండేషన్, ఛైర్మన్ ఎల్. గంగాధర శాస్త్రి సమీక్షించబోతున్నారు. ఈ కార్యక్రమంలో రచయిత ఎంవీఆర్ శాస్త్రితో పాటు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. ఓ గ్రంధ సమీక్షా కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరపడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. ఈ రకంగా పుస్తకం పట్ల తనకున్న మక్కువను పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు.