హైదరాబాద్ లోనే ఉంటూ కోరుకున్న ప్రదేశంలో చిత్రీకరణ జరుపుతున్నట్టు భ్రమింప చేస్తున్న రోజులివి. ‘వర్చువల్ టెక్నాలజీ’తో ఇప్పటికే మీడియా ఈ దిశగా సాగుతూ పలు ప్రయోగాలు చేస్తోంది. సినీజనం కూడా అదే బాటలో పయనిస్తూ వర్చువల్ ప్రొడక్షన్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. సృజనాత్మకత కలిగిన ఎందరో దర్శకులు, నిర్మాతలు ఈ వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా తమ ప్రాజెక్ట్స్ ను మరింత అందంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. ఇందుకోసం కొందరు విదేశాలకు పరుగులు తీసి వర్చువల్ గా తమ చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను రూపొందించేవారు. అలాంటి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా వర్చువల్ ప్రొడక్షన్ వేదికను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. మన భారతదేశంలో తొలి ఎల్.ఈ.డి. వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ను నెలకొల్పనున్నట్టు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఇదే నెలకొంటే పాన్ ఇండియా మూవీస్, అంతర్జాతీయ చలనచిత్రాల రూపకల్పనలోనూ సృజనాత్మక దర్శకులు, నిర్మాతలు, కళాకారులకు ఎంతో మేలు జరగనుంది.
20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు, 2.3 ఎమ్.ఎమ్. డాట్ పిచ్ కర్వులతో ఈ వర్చువల్ స్టేజ్ రూపొందనుంది. ఇందులో అల్ట్రా హై రిఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గ్యామట్, హై బ్రైట్ నెస్ ఎల్.ఈ.డి. స్క్రీన్ తో వరల్డ్ క్లాస్ పర్మనెంట్ స్టేజ్ ఏర్పాటు కానుంది. మన దేశంలో ఈ స్థాయి వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఇదే మొదటిది కానుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే, నిర్మాతలు, దర్శకులు తమ సృజనకు తగిన రీతిలో న్యాయం జరగనుంది. అంతేకాదు, ఈ విధానం వల్ల నిర్మాణవ్యయాన్నీ తగ్గించుకోవచ్చునని తెలుస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలు చేస్తోన్న ‘క్యూ’ ట్యూబ్ తో కలసి ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకోవడం పట్ల అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగార్జున అక్కినేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే సాంకేతికంగా ఎంతో ముందున్న తాము, సినిమా రంగంలోనూ అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీని సమకూర్చడం ఆనందంగా ఉందని క్యూ ట్యూబ్ సహ వ్యవస్థాపకులు సెంథిల్ కుమార్ తెలిపారు.