NTV Telugu Site icon

మరపురాని మధురం.. ఘంటసాల గానం..

ghantasala

ghantasala

“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు.

యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’ చిత్రంలో ఆయన అభినయానికి తగిన రీతిలో గళవిన్యాసాలు చేశారు ఘంటసాల. అదే చిత్రానికి మరపురాని బాణీలు సమకూర్చి మురిపించారాయన. ఆ సినిమా జైత్రయాత్రతోనే ఘంటసాల వారి సంగీతం సైతం విజయయాత్ర ఆరంభించింది అంటే అతిశయోక్తి కాదు. ఏయన్నార్ ను ట్రాజెడీ కింగ్ గా మలచిన ‘దేవదాసు’లోని పాటల్లోనూ ఘంటసాల గానానికే పెద్ద పీట వేయవలసి వస్తుంది. అందుకే ఆ ఇద్దరు మహానటులు తమ అభినయానికి ఘంటసాల గానం ఆత్మ అన్నారు.

యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ నవరసభరిత పాత్రల్లో జీవించారు. ప్రతి రసంలోనూ ఘంటసాల గానం వారితో పయనం చేయడం విశేషం. హాస్యమైనా, భయానకమైనా, బీభత్సమైనా, రౌద్రమైనా, శాంతమైనా, శృంగారమైనా, వీరమైనా, కరుణయైనా, అద్భుతంగా పలికించి పులకింప చేశారు నటరత్న, నటసమ్రాట్. ఆ రసాలన్నిటా ఘంటసాల గాత్రమూ వారి అభినయానికి తోడుగా సాగింది. ఇక ఈ ఇద్దరూ భక్తిరసం కురిపించిన సమయంలోనూ ఘంటసాల గానమే దన్నుగా నిలచింది.

పౌరాణికాలలో తెలుగువారి ప్రతిభ అనితరసాధ్యం అని అందరికీ తెలుసు. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలోనూ మన తెలుగువారిదే పైచేయి! ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలోని పద్యాలు ఘంటసాల గళంలో అమృతమయమై పోయాయనే చెప్పాలి. తెలుగువారిని విశేషంగా అలరించిన పౌరాణిక చిత్రరాజం యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన ‘లవకుశ’. ఈ చిత్రంలోని అన్ని పాటలూ విశేషాదరణ పొందాయి. వాటిని మధురంగా మార్చింది ఘంటసాల సంగీతమనే చెప్పాలి. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన పౌరాణికాలు “మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం” చిత్రాలలోనూ ఘంటసాల గళమే ఇరువురి అభినయానికి ప్రాణం పోసింది. ఇక ‘భూకైలాస్’లో అయితే “దేవ దేవ ధవళాచల మందిర…” అంటూ ఆరంభమయ్యే ఒకే పాటలో ఇద్దరికీ ఘంటసాల నేపథ్యగానం చేయడం మరింత విశేషం! తెలుగు చిత్రసీమకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అంటారు. ఆ రెండు కళ్ళలో కాంతిని నింపింది ఘంటసాల గానమే అని మరువరాదు.