The Ghost: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ మరియు ఎస్విసీ ఎల్ఎల్పి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల జోరును పెంచేసిన మేకర్స్.. ఈ నెల 25 న కర్నూల్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కర్నూల్ లోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఇక ఈ ఈవెంట్ కు అక్కినేని నటవారసులు ముఖ్య అథిధులుగా రానున్నారు.
తండ్రి కోసం కొడుకులు రంగంలోకి దిగుతున్నారు. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఈవెంట్ కు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ అన్నదమ్ములిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చైతూ, వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా.. అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానున్నాయి. సాధారణంగా వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్టులుగా వెళ్లే అక్కినేని హీరోలు మొదటిసారి తండ్రి ఫంక్షన్ కు గెస్టులుగా రాబోతున్నారు. మరి ఈ వేదికపై ఈ అక్కినేని త్రయం ఎలాంటి స్పీచ్ లతో అదరగొడుతుందో చూడాలి.