NTV Telugu Site icon

నాని, థమన్ మధ్య ‘సమ్ థింగ్… సమ్ థింగ్’

Thaman

నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ కంపోజర్ థమన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు పరోక్ష విమర్శలు చేసుకున్నారు. ముందుగా నాని ఓ ఇంటర్వ్యూలో నటులు, టెక్నీషియన్స్ ఎవరూ సినిమాను డామినేట్ చేయకూడదని అన్నారు. అంతే కాదు సంగీతం కానీ వేరే ఏదైనా క్రాఫ్ట్ కానీ ఫిల్మ్‌తో కలిసి ముందుకు సాగినపుడే ఆ సినిమా హైలైట్ అవుతుందని చెప్పాడు. నిజానికి నాని ముందు మూవీ ఓటీటీలో విడుదలై ప్లాఫ్ అయిన ‘టక్ జగదీష్’కి తమన్ సంగీత దర్శకుడు. ఏమైందో ఏమో కానీ ఆ సినిమాకు పాటలను థమన్ కంపోజ్ చేయగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గోపీసుందర్ ఇచ్చారు. అసలు థమన్ అంటేనే రీరికార్డింగ్ స్పెషలిస్ట్ అంటారు. ఈనికి ఉదాహరణ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన బాలకృష్ణ ‘అఖండ’. ఈ మూవీ చూసిన అందరూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి గొప్పగా చెప్పారు. అలాంటి థమన్ ని తన ‘టక్ జగదీష్’ సినిమా రీరికార్డింగ్ తప్పించి గోపీసుందర్ కి ఇచ్చినపుడే సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ పలు గాసిప్స్ షికార్లు చేశాయి. ఇప్పుడు నాని తన ఇంటర్వ్యూలో సంగీతంతో సహా ఏదీ డామినేట్ చేయకూడదని చెప్పటంతో దీనికి థమన్ కూడా పరోక్షంగా ట్వీట్ ల మీద ట్వీట్స్ వేశాడు.

థమన్ ట్వీట్స్ గమనిస్తే అది నానిపై ఎదురుదాడే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ఫార్మేట్స్ లో క్రాఫ్ట్‌లు కలిసిమెలసి ప్రయాణం చేసినప్పుడే దానిని చలనచిత్రం అని పిలుస్తాము. అంతే కాని డామినేటెడ్ క్రాఫ్ట్స్ అని పిలవరు. గొప్ప విజువలైజేషన్ లేకుండా అసాధారణమైన క్యారెక్టరైజేషన్స్ రూపొందించినా భావోద్వేగాలు పండవు. సినిమా ఎప్పటికీ వన్ మ్యాన్ షో కాదు. మేం సినిమాని ఇష్టపడతాం దాని కోసం చనిపోటానికి కూడా సిద్ధం’ అని ట్వీట్ చేశాడు థమన్. నాని పేరు ప్రస్తావించకపోయినా… నాని వ్యాఖ్యలు థమన్ ని నొప్పించాయని ఇట్టే తెలిసిపోతుంది. మరి నాని, థమన్ మధ్య మళ్ళీ సయోధ్య ఎప్పడు కుదురుతుందో!?