దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వారిసు సినిమాని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు కానీ తెలుగు వర్షన్ ని మాత్రం వాయిదా వేస్తున్నారు. చిరు, బాలయ్యలు నటిస్తున్న సినిమాలకి ఎక్కువ థియేటర్స్ దొరకాలి, మన ఆడియన్స్ మన సినిమాని ముందు చూడాలి, అది నాకు మన హీరోల పైన ఉన్న ప్రేమ అని చెప్తూ దిల్ రాజు ‘వారసుడు’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు. దీంతో వారసుడు సినిమా మూడు రోజుల డిలేతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకి రానుంది. అనుకున్నదే అయ్యింది దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేశాడు అనే కామెంట్స్ వినిపించడం మొదలయ్యాయి. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్, తెలుగులో గత కొంతకాలంగా తన సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు.
అట్లీ, విజయ్ కాంబినేషన్ లో 2017లో రిలీజ్ అయిన ‘మెర్సల్’ సినిమా తెలుగులో ‘అదిరింది’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఇక్కడి నుంచే విజయ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ తర్వాత 2018లో విజయ్, మురుగదాస్ తో ‘సర్కార్’ సినిమా చేశాడు, ఈ మూవీ కూడా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. 2019 బిగిల్ సినిమాని తెలుగులో ‘విజిల్’ పేరుతో రిలీజ్ చేసిన విజయ్ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు సినిమాని రిలీజ్ చెయ్యని విజయ్, 2021లో లోకేష్ కనగారాజ్ తో కలిసి ‘మాస్టర్’ సినిమా చేశాడు. ఈ మూవీ తెలుగులో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. విజయ్ లాస్ట్ మూవీ ‘బీస్ట్’ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది కానీ KGF 2 దెబ్బకి ఎక్కువ రోజుల థియేటర్స్ లో కనిపించలేదు.
ఇలా 2017 నుంచి బైలింగ్వల్ రిలీజ్ కే వెళ్తున్న విజయ్ మొదటిసారి 2022లో సింగల్ లాంగ్వేజ్ రిలీజ్ కి పరిమితం అవుతున్నాడు. మూడు రోజుల డిలే అనేది ఈ డిజిటల్ ఎరాలో చాలా ఎక్కువ. ఒక తెలుగు ప్రొడ్యూసర్ కారణంగా ఆరేళ్ల తర్వాత విజయ్ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాకుండా ఆగిపోయింది అంటూ విజయ్ ఫాన్స్ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. తమిళ్ లో వారిసు సినిమా టాక్ తేడా కొట్టినా, యావరేజ్ అనే టాక్ స్ప్రెడ్ అయినా తెలుగులో వారసుడు సినిమాని ఆడియన్స్ పట్టించుకునే ఛాన్స్ లేదు. మరి విజయ్ ‘వారసుడు’ సినిమా ఫ్యూచర్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.
