NTV Telugu Site icon

Tollywood movies: ఈ వారం ఉగాదికి… ఆ తర్వాత….

Tollywood

Tollywood

Telugu Cinema: మార్చిలో ఐదు ఫ్రైడేస్ రావడంతో దాదాపు 30 చిత్రాలు విడుదల అయ్యేలా ఉన్నాయి. ఇప్పటికే అనువాద చిత్రాలతో కలిపి సుమారు 20 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ వారం 22న తెలుగు సంవత్సరాది కావడంతో సినిమాల సందడి మరి కాస్తంత పెరిగింది. ఉగాది బుధవారం రావడంతో… ఈ వారమంతా తమకు కలిసి వస్తుందని కొందరు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో ఫ్రైడే కాకుండా రెండు రోజుల ముందే తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు.

అలా ఈ ఉగాది వస్తున్న చిత్రాలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దాస్ కా ధమ్కీ’. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు ప్లాన్ చేశారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ పాటలు ఇప్పటికే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన వారు మాస్ ను విశేషంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఇక ఉగాది రోజునే కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ వస్తోంది. ఇది మరాఠీ చిత్రం ‘నటస్రమాట్’కు రీమేకే అయినా… కృష్ణవంశీ దీనికి తనదైన శైలిలో తెలుగుదనాన్ని అద్దారు. ఈ సినిమా ప్రీమియర్స్ కు విశేష స్పందన లభించింది. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం పోటీ పడి నటించారని, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు అద్భుత నటన కనబరిచారని అంటున్నారు. సీతారామశాస్త్రి, లక్ష్మీ భూపాల్, కాసర్ల శ్యామ్, విజయ్ కుమార్ రాసిన పాటలకు ఇళయరాజా స్వరరచన చేశారు. ఈ మూవీతో కృష్ణవంశీ మరోసారి తానేమిటో నిరూపించుకున్నాడని చెబుతున్నారు. ఇక ఉగాది రోజునే నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ‘గీత సాక్షిగా’ మూవీ రాబోతోంది. ఆద‌ర్శ్‌, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. నిర్మాత చేతన్ రాజే కథను అందించారు. ఆంధోని మట్టిపల్లి ఈ మూవీని తెరకెక్కించారు. అదే రోజున శివ పాలమూరు దర్శకత్వంలో మహి రాథోడ్ నిర్మించిన ‘1992’ మూవీ, కాజల్ నటించిన తమిళ అనువాద చిత్రం ‘కోస్టీ’ వస్తున్నాయి.

ఇక రెగ్యులర్ ఫ్రైడే రిలీజెస్ ఉండనే ఉన్నాయి. భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మాతలుగా రాజ్ కార్తికేన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం ‘రాజ్ కహాని’. ఈ నెల 24న రాబోతున్న ఈ సినిమాకు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ సంగీతం అందించాడు. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభశ్రీ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ‘కథ వెనుక కథ’ చిత్రం శుక్రవారం వస్తోంది. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో అవ‌నింద్ర కుమార్ దీన్ని నిర్మించారు. అలానే ఆంగ్ల చిత్రం ‘జాన్ విక్ -4’ సైతం తెలుగులో డబ్ అయ్యి 24న వస్తోంది. ఆ రకంగా ఈ వారం 8 సినిమాను థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

Show comments