రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది సింగర్స్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’. పలు నగరాలు, పట్టణాలలో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి, ఈ షోలో పాల్గొనేందుకు కొంతమంది గాయనీ గాయకులను ఎంపిక చేశారు. మొత్తానికి మోస్ట్ అవైటింగ్ సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ ఫస్ట్ ఎపిసోడ్ ను ఈ శుక్రవారం ఆహా స్ట్రీమింగ్ చేసింది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడిల్ 5 విజేత, బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్, నటి, గాయని నిత్యామీనన్, పాపులర్ కార్తిక్ ఈ షోకు జడ్జెస్. క్షణం తీరిక లేకుండా స్టార్స్ మూవీస్ కు సంగీతం అందించే పనిలో తలమునకలై ఉండే… తమన్ లాంటి యంగ్ అండ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ షో కు టైమ్ ఇవ్వడం రియల్లీ గ్రేట్ థింగ్! అతని కారణంగా ఈ షోకు మరింత వెయిటేజ్ వచ్చింది.
మొదటి ఎపిసోడ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ గా స్టేజ్ మీదకు వచ్చింది అర్చకం మాన్య చంద్రిక. తిరుపతికి చెందిన మాన్య అక్కడ నుండి జడ్జెస్ కోసం తీర్థప్రసాదాలు తీసుకొచ్చింది. ‘దేవుడి ఆరాధన, సంగీత ఆలపన, తండ్రిని అనుసరించడం తనకు ఎంతో ఇష్టమ’ని చెప్పింది మాన్య. సంప్రదాయ దుస్తుల్లో స్టేజ్ మీదకు వచ్చిన మాన్య ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావ… ఊహూ అంటావా మావా’ అనే ఐటమ్ సాంగ్ పాడతాననే సరికీ అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న తాను అన్ని పాటలూ పాడగలనని నిరూపించుకోవడానికే ఈ సాంగ్ ఎంచుకున్నట్టు మాన్య తెలిపింది. అంతే హస్కీ వాయిస్ తో పాడింది కూడా! ఆమె పాటకు నిత్య, కార్తీక్ ఫిదా అయిపోయారు. అయితే తమన్ మాత్రం మరో పాట పాడమని కోరడంతో ‘పలుకే బంగారమాయేనా…’ అంటూ రామదాసు కృతిని ఆలపించి, అతని దగ్గర కూడా మార్కులు కొట్టేసింది మాన్య. ఆమెకు ‘యస్’ అనే కార్డ్ ఇచ్చారు జడ్జెస్.
సెకండ్ పార్టిసిపెంట్ సుదీప్ బేసికల్ గా కంపోజర్. అతను ‘కేరాఫ్ కంచరపాలెం’లోని ‘ఆశా పాశం…’ గీతాన్ని అద్భుతంగా పాడి గోల్డెన్ టిక్కెట్ అందుకున్నాడు. మూడో పార్టిసిపెంట్ గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాద్ కు చెందిన వైష్ణవి. ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘కడలి’ సినిమాలోని ‘యాడికే…’ గీతాన్ని వైష్ణవి చక్కగా పాడింది. ఆమె గానామృతాన్ని ఆస్వాదించిన తమన్… ఎ. ఆర్. రెహమాన్ కు వైష్ణవిని రికమండ్ చేస్తానని మాట ఇచ్చాడు. న్యాయనిర్ణేతలు ఆమెకు గోల్డెన్ మైక్ ఇవ్వడం విశేషం. ‘చివరగా దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా దేవాలయం సమీపంలో ‘ఇంటి దోసె బండి’ని నిర్వహిస్తున్న శివకుమార్ తన ప్రతిభను చాటాడు. ‘రుద్రవీణ’ సినిమాలోని ‘తరలి రాద తనే వసంతం’ గీతాన్ని ఆలపించాడు. సింగర్ కావాలనే కోరికతో హైదరాబాద్ వచ్చి, ఎనిమిదేళ్ళుగా తల్లిని కూడా చూడకుండా ఇక్కడే ఉన్న శివకుమార్ పట్ల న్యాయనిర్ణేతలు బోలెడంత అభిమానం చూపించారు. అతనిలోని పట్టుదలను ప్రోత్సహిస్తూ ‘ఎస్’ కార్డ్ ఇచ్చారు. ఇలా నలుగురు సింగర్స్ అద్భుతంగా పాటలు పాడి మెప్పిస్తే… ఉమేష్ అనే కుర్రాడు నిత్యామీనన్ కోసం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ పాటను తనదైన స్టైల్ లో పాడి… వీక్షకులకు వినోదాన్ని పంచాడు.
‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమానికి శ్రీకారమైతే చుట్టారు కానీ… దీనికి సంబంధించిన ఇతర వివరాలు తెలుపకపోవడం పెద్ద లోటు. జడ్జెస్ ఇచ్చే డిఫరెంట్ టిక్కెట్స్ పార్టిసిపెంట్స్ కు ఎలా ఉపయోగపడతాయి? విజేతలకు లభించే ప్రైజ్ మనీ ఎంత? ఓవర్ ఆల్ కాన్సెప్ట్ ఏమిటీ అనేది మొదట్లోనే శ్రీరామచంద్రతో చెప్పించి ఉంటే బాగుండేది. పాటలు పాడిన తర్వాత వారిని ఎప్రిషియేట్ చేస్తూ, నేపథ్యంలో చప్పట్లు వినిపించాయి తప్పితే… జనాలు కనిపించలేదు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ప్రోగ్రామ్ ను డిజైన్ చేస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సింగర్ కార్తిక్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అతను లైంగిక వేదింపులకు పాల్పడ్డాడంటూ, ‘మీ టూ’ సమయంలో కొందరు లేడీ సింగర్స్ ఆరోపణలు చేశారు. అప్పట్లో దానిని కార్తిక్ ఖండించాడు. కానీ అలాంటి వ్యక్తిని ఈ షోకు జడ్జిగా ఎలా పెడతారంటూ కొందరు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి సైతం ఆ విమర్శకులను సమర్థిస్తోంది. మరి దీనిపై కార్తిక్, నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
