తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు. శివుడు పూనినట్టుగా ఈ పాటకు వాళ్ళంతా ప్రాణం పెట్టారని అన్నారు. శ్రీనివాస్ పాటకు ముగ్థులైన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అని చెప్పారు. ఆ తర్వాత తన జీవితంలో సూపర్ హీరోస్ గురించి చెబుతూ, తన తల్లితో పాటు తాను ప్రేమించిన అమ్మాయి కూడా ఉందని శ్రీనివాస్ తెలిపాడు. ఆ అమ్మాయి ప్రపోజ్ చేసినా, తాను ఎలా చేయాలో తెలియక మౌనంగా ఉన్నానని అన్నాడు. దాంతో స్టేజ్ మీదకు వెళ్ళిన తమన్… అతన్ని సరదాగా ఆటపట్టించాడు. పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం ఉంటే… వెంటనే లవ్ ప్రపోజ్ చేయమంటూ నిత్యా మీనన్ సలహా ఇచ్చింది. ఆహా లో జరుగుతున్న తెలుగు ఇండియన్ ఐడిల్ లో మ్యూజికల్ మేటర్స్ మాత్రమే కాకుండా మేటర్స్ ను మ్యూజికల్ గా చెబుతున్నారని కార్తీక్ కామెంట్ చేశాడు. ఇది మాట్రిమోనియల్ కార్యక్రమంగా మారిపోయిందని తమన్ సరదాగా అన్నాడు.
Read Also : HBD Ram Charan : స్పెషల్ పిక్ షేర్ చేసిన చిరు… వింతగా ఉందట !!
తిరుపతికి చెందిన మాన్య చంద్రన్ మణిరత్నం దర్శకత్వం వహించిన ‘గురుకాంత్’లోని ‘నువ్వు నీలి సముద్రంలే… నే తీరపుటంచునులే’ గీతాన్ని పాడింది. రెహ్మాన్ అత్యద్బుతంగా ఈ పాటను కంపోజ్ చేశారని, దాదాపు 200 నుండి 250 మంది ఆ పాటకు వాద్యసహకారం అందిస్తే… ఇక్కడ కేవలం ఆరేడు మంది అదే స్థాయిలో పాటను ప్రెజెంట్ చేశారని తమన్ అన్నాడు. ఈ పాట లింక్ ను రెహ్మాన్ కు పంపుతానని చెప్పాడు. తన సూపర్ హీరో తండ్రి అని, అలానే వృత్తిపరంగా వస్తే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని మాన్య తెలిపింది.
కార్తీక్ ను ఆటపట్టించిన సహచరులు!
తెలుగు ఇండియన్ ఐడిల్ లోని వీడియోస్ లో సోషల్ మీడియాలో ఒకటి బాగా వైరల్ అవుతోందని శ్రీరామచంద్ర చెప్పాడు. కంటెస్టెంట్స్ పేర్లను మర్చిపోవడం లేదంటే తప్పుగా పలకడం కార్తీక్ కు అలవాటు. ప్రతిసారీ పక్కనే ఉన్న నిత్యా మీనన్ సహాయం తీసుకుంటూ ఉంటాడు కార్తీక్. ఆ వీడియో ఒకటి విశేషంగా చక్కర్లు కొడుతోందని, దాన్ని ప్లే చేశారు. ప్రస్తుతం ఉన్న 12 మంది కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటూ కార్తీక్ కు ఓ పరీక్ష కూడా పెట్టారు. అందులో కొంత మంది పేర్లు మర్చిపోయి, మరి కొందరి పేర్లు తప్పుగా చెప్పి కార్తీక్ నవ్వుల పువ్వులు పూయించాడు. ఆ తర్వాత ప్రణతి ‘అందగాడా… భలే అందగాడా’ గీతాన్ని పాడి ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అనిపించుకుంది. తన సూపర్ హీరో తల్లి అని చెబుతూ, ఆమెతో కలిసి ఈ స్టేజ్ మీద పాట పాడాలన్నది తన కోరికగా తెలిపింది. దాంతో వారిద్దరితో పాట పాడించారు. న్యాయనిర్ణేతలు వీరికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలానే గిఫ్ట్ హ్యాంపర్ కూడా అందచేశారు.
‘లాల్ దర్వాజ్ లష్కర్ బోనాల కొస్తనని రాకపోతివి’ పాటను అత్యద్భుతంగా పాడి అందరి మనసులు చూరగొంది లాలస. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావంటూ నిత్యా మీనన్ తెగ మెచ్చుకుంది. లవ్డ్ ఇట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. లాలస పాట పాడుతుంటే ధోనీ సిక్స్ కొట్టినట్టుగా అనిపించిందని తమన్ అన్నాడు. తన సూపర్ హీరోస్ అమ్మా, నాన్న అని చెప్పింది లాలస. అలానే మావయ్య శ్రీరామచంద్ర కూడా తనకు సూపర్ హీరోనే అని తెలిపింది. అతను ఇండియన్ ఐడిల్ షోలో పాటలు పాడుతుంటే ఎంతో ఇష్టంగా చూసేదాన్నని చెప్పింది. పంజాబ్ కు చెందిన జస్కరణ్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ పాట పాడి ఆకట్టుకున్నాడు. ఆ పాటను తమిళంలో తానే పాడానని కార్తీక్ చెప్పాడు. నిత్యామీనన్ ఆ పాటకు ఫిదా అయిపోయానని చెప్పింది. అంతేకాదు… శ్రీరామచంద్ర కోరిక మేరకు వేదిక పైకి వెళ్ళి ఆ పాటకు తనదైన శైలిలో స్టెప్పులూ వేసింది. తన సూపర్ హీరో అల్లు అర్జున్ అని చెప్పాడు జస్కరణ్.
జై బాలయ్య… జైజై బాలయ్య!
ఈ ఎపిసోడ్ లో చివరగా లక్ష్మీ శ్రావణి పాట పాడింది. ‘సింహా’ సినిమా కోసం చక్రి స్వరపరిచిన ‘సింహమంటే చిన్నోడే’ పాటను అద్భుతంగా ఆలపించింది లక్ష్మీ శ్రావణి. ఆమెలోని సింగింగ్ క్వాలిటీకి జడ్జీలు ఆనంద పడ్డారు. అయితే ఒకే తరహా పాటలు కాకుండా… అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి… భిన్నమైన పాటలు పాడమని నిత్యామీనన్ సలహా ఇచ్చింది. బాలయ్య సినిమాలోని పాటను లక్ష్మీ శ్రావణి పాడటంతో కంటెస్టెంట్స్ అంతా జై బాలయ్యా… జైజై బాలయ్యా అంటూ నినదించారు. అలానే బాలయ్యకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నినాదాలను తమన్ తో సహా ప్రతి ఒక్కరూ చెప్పి నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టున్నారు. ఆ రకంగా ఈ వీకెండ్ లో 12 మంది సింగర్స్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.