ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో మన దర్శకులు సినిమాలు చేశారు. రాజమౌళి అయితే పులితో రామ్ చరణ్ తో ఏకంగా మొహం పగలకొట్టించాడు కూడా. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ సీన్ ని సినీ అభిమానులంతా విజిల్స్ వేశారు. ఆ తర్వాత పులి స్థాయిలో వాడిన మరో జంతువు సింహం. ఈ అడివి రాజుని ఎలివేషన్ కోసం మాత్రమే కాదు సినిమా టైటిల్స్ కోసం కూడా వాడేసారు. బాలయ్య లాంటి హీరో సినిమా టైటిల్ లో ‘సింహా’ అనే పదం ఉంటే చాలు నందమూరి అభిమానులకి పూనకలు వస్తాయి. పులి, సింహం లాంటి క్రూర జంతువులు అయిపోయాక మన ఫిల్మ్ మేకర్స్ కి ‘ఈగల్’ దొరికింది. ‘ది ఈగల్ ఈజ్ కమింగ్’ అంటూ హీరో క్యారెక్టర్ కి కాస్త తెలివితేటలు ఉంటే చాలు ఈగల్ ని వాడేసారు. మధ్యలో పీరియాడిక్ డ్రామా జానర్ లో తెరకేక్కే సినిమాల కోసం గురాన్ని కూడా గట్టిగానే వాడారండోయ్.
మెగా హీరోలని ఎలివేట్ చెయ్యడానికి గుర్రపుస్వారీలు ఉపయోగ పడినంత మరో జంతువు ఉపయోగ పడలేదు. మెగాస్టార్ నుంచి పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ వరకూ ప్రతి ఒక్కరూ గుర్రం ఎక్కిన వారే. ఇలా సినిమాల్లో ఎదో ఒక చోట జంతువులని వాడి హిట్ కొట్టడం మన ఫిల్మ్ మేకర్స్ కి బాగా అలవాటైన పని. పులి, సింహం, గుర్రం, ఈగల్ లాంటివి అయిపోయిన తర్వాత ఫిల్మ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు ‘కాకి’పైన పడినట్లు ఉంది. బలగం సినిమా మొత్తం కాకి చుట్టే తిరిగింది, దసరా సినిమాలో కూడా కాకి ప్రెజెన్స్ ఉంది. ఇక లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరుపాక్ష’ సినిమాలో కూడా ‘కాకి’ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎవరైనా చనిపోతే, వారికి పిండం పెట్టడం మన ఆచారం. ఈ సమయంలో కాకి వచ్చి ఆ పిండం తింటే చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరినట్లు అని మనం భావిస్తూ ఉంటాం. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కాకి ఈ పాత్రమే ప్లే చేస్తుంది. మరి ఈ కాకి ట్రెండ్ తెలుగు సినిమాల్లో ఎన్ని రోజులు ఉంటుందో, ఈ హ్యాట్రిక్ సెంటిమెంట్ ఇంకెన్ని సినిమాలకి పాకుతుందో చూడాలి.