తెలంగాణలో భారీ చిత్రాల విడుదల సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ, న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది.
Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!
సినిమా టికెట్ల ధరలను పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్ళీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ధర్మాసనం నిలదీసింది. “ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వ ప్లీడర్‌ను (GP) కోర్టు ప్రశ్నించింది. ప్రజలపై ఆర్థిక భారం పడేలా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక ఆంతర్యం ఏమిటని నిలదీసింది.
పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. టికెట్ల ధరల పెంపు ప్రక్రియలో నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట ప్రకారం టికెట్ ధరల పెంపు లేదా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, హైదరాబాద్‌లో పోలీస్ కమిషనర్‌కు మాత్రమే ఉంటుంది. కానీ హోంశాఖ కార్యదర్శి నేరుగా మెమోలు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. మెమో జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా మెమో జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. చట్ట వ్యతిరేకంగా ధరల పెంపును ప్రోత్సహిస్తున్న సదరు అధికారికి 5 లక్షల రూపాయల జరిమానా విధించాలని ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టు తాజా వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో , ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాన్య ప్రేక్షకులపై భారం పడకుండా ఉండాలని కోర్టు భావిస్తుండగా, ప్రభుత్వం నుంచి వచ్చే మెమోలు అందుకు విరుద్ధంగా ఉండటంపై న్యాయస్థానం సీరియస్‌గా ఉంది. ఈ వివాదంపై తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తుది ఆదేశాలు ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Parasakthi Release: శివకార్తికేయన్ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!
