టాలీవుడ్ లో హీరోయిన్‌గా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరున్న ఈ దేవాలయానికి ఇప్పటి నుంచే జనాలు వెళుతున్నారు. అయితే, భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ మొక్కుబడిగా భావిస్తూ ఉంటారు. అయితే, టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను ఆ బెల్లం తక్కెడలో కూర్చోబెట్టి, దాని బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పిస్తున్నట్లుగా టీనా శ్రావ్య తల్లి సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒక వీడియో పోస్ట్ చేశారు.
Also Read :Karate Kalyani: కరాటే కళ్యాణిపై దాడి.. చున్నీ లాగేసిన దుండగులు
ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో, చాలామంది సమ్మక్క సారలమ్మ దేవతలను అవమానించేలా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే టీనా శ్రావ్య తల్లి మాత్రం, తాము దేవతలను అవమానించడం లేదని, తమ కుక్కకు ఆరోగ్యం బాలేనప్పుడు అంతా సెట్ అయితే అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి బంగారం ఇచ్చుకుంటామన్నామని, సర్జరీ అయ్యి కోలుకున్నాక ఇప్పుడు సమర్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం తెలియక కొంతమంది అన్‌ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కామెంట్స్ చేస్తే అవన్నీ మీకే ఆంటీస్, అంకుల్స్ అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియోకి కొంతమంది ఇలా బెల్లాన్ని సమర్పించడం కరెక్టేనంటూ కామెంట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం మీరు తెలంగాణ దేవతను అవమానిస్తున్నారు, వీడియో డిలీట్ చేయమంటూ కామెంట్ చేస్తున్నారు.