Tabitha Sukumar: సెట్స్‌లో ఎప్పుడూ సీరియస్‌గా, పర్ఫెక్షన్ కోసం తపించే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఎలా ఉంటారో ఆయన సతీమణి తబిత సుకుమార్ బయటపెట్టారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఇడుపు కాయితం’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. ఈ వేడుకలో యాంకర్ అడిగిన ఒక సరదా ప్రశ్నకు తబిత చెప్పిన ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈవెంట్లో భాగంగా “మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు మొదట ఎవరు సారీ చెప్తారు? ఎవరు తగ్గుతారు?” అని యాంకర్ ప్రశ్నించగా, తబిత ఏమాత్రం ఆలోచించకుండా “ఆయనే.. అసలు గ్యాప్ లేకుండా ఆయనే సారీ చెప్తారు” అంటూ నవ్వుతూ బదులిచ్చారు. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. “ముందు ఎవరు సారీ చెప్తారని కాదు, అసలు గొడవ ఎవరు పెట్టుకుంటారని అడగాలి అని యాంకర్ మళ్లీ ప్రశ్న అడిగితే. గొడవ పెట్టుకునేది కూడా ఆయనే, అందుకే మళ్లీ ఆయనే సారీ చెప్తారు” అంటూ అసలు సీక్రెట్ లీక్ చేశారు. గొడవ పెద్దదవుతుందని అర్థం కాగానే, అది పూర్తికాకముందే “ఓ.. నేను గొడవ పడుతున్నాను” అని రియలైజ్ అయి, మధ్యలోనే “సారీ.. సారీ.. సారీ” అంటూ సుకుమార్ కాంప్రమైజ్ అయిపోతారని తబిత సరదాగా చెప్పుకొచ్చారు.
ఇక సినిమా గురించి మాట్లాడుతూ తబిత ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు వంశీ కథ చెప్పినప్పుడు తను ఏదైతే ఊహించుకున్నారో, సినిమా ఫస్ట్ హాఫ్ చూశాక అచ్చం అలాగే తెరపై కనిపించిందని ప్రశంసించారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ కథ తనకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని చెప్పారు. “చిన్నప్పుడు మన ఇళ్లలో పెళ్లిళ్లు జరిగినప్పుడు ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అంటూ జరిగే సరదా డిస్కషన్స్ అన్నీ ఈ సినిమాలో మళ్లీ చూశాను. ప్రేక్షకులందరికీ పాత రోజుల్లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది” అని అన్నారు. ప్రియదర్శి, నాగదుర్గా, సహా నటీనటులంతా అద్భుతంగా చేశారని కితాబిచ్చిన ఆమె, డిసెంబర్ 11న విడుదలవుతున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు.

