కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన “సూరారై పొట్రు” తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో విడుదలైన విషయం తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. డైరెక్ట్ ఓటిటిలో ఈ మూవీని రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంతేకాదు ‘ఆస్కార్’ రేసులోనూ నిలిచిన ఈ చిత్రం జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం దక్కించుకుంది. ఎన్నో రికార్డులు సృష్టించి విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాపై తాజాగా అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన ఎమోషన్ నోట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ సినిమాలోని “కాయిలే ఆకాశం” అనే సాంగ్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ స్పెషల్ గా పోస్ట్ చేశారు. ఆ పాటను గీత రచయిత యుగభారతి రాయగా జీవీ ప్రకాశ్ భార్య సైంధవి పాడారు.
Read Also : అమితాబ్ ను ఏడిపించిన సూర్య
తాజాగా అమితాబ్ పోస్ట్ పై ఈ సినిమా హీరో సూర్య స్పందించారు. “సూరారై పొట్రు”కు ఇలాంటి అద్భుతమైన ప్రశంసలు, మాటలే గ్రేటెస్ట్ రివార్డులు అని, అమితాబ్ మాటలు తన మనసుని తాకాయని చెబుతూ ఆయనకు సూర్య ధన్యవాదాలు తెలిపారు. దీంతో మరోసారి “ఆకాశం నీ హద్దురా” మూవీ వార్తల్లో నిలిచింది.