Superstar Krishna Live Updates: సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని నానక్‌రామ్‌గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
-
అంతిమ సంస్కారాలు నిర్వహించిన మహేష్‌బాబు
హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు మహేష్‌బాబు.
-
ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు
మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.. కృష్ణ పార్థివదేహానికి గౌరవ వందనం చేసిన పోలీసులు.. ఆయనకు గౌరవంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు..
-
మహా ప్రస్థానం చేరుకున్న అంతిమ యాత్ర
పద్మాలయ స్టూడియో నుంచి ప్రారంభమైన సూపర్ స్టార్ కృష్ణ అంతిమయాత్ర.. కాసేపటి క్రితమే మహా ప్రస్థానం చేరుకుంది.. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు..
-
కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం
పద్మాలయా స్టూడియోస్ నుంచి కృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఫిలింనగర్ మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి.
-
కృష్ణ పార్ధివ దేహానికి బండి సంజయ్ నివాళి
పద్మాలయా స్టూడియోస్‌లో కృష్ణ పార్ధివ దేహానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నివాళులర్పించారు.
-
కృష్ణకు కోట శ్రీనివాసరావు నివాళి
సూపర్ స్టార్ కృష్ణకు టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. నడిచేందుకు వీలు కాకపోయినప్పటికీ తన అభిమాన నటుడి చివరి చూపు కోసం వచ్చారు. వ్యక్తిగత సిబ్బంది సహాయంతో కృష్ణ పార్థివ దేహం దగ్గరకు వెళ్లి, నివాళులు అర్పించారు.
-
సంప్రదాయం ప్రకారం పూజలు
పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహానికి హిందూ సాంప్రదాయం ప్రకారం పురోహితులు పూజలు నిర్వహించారు. కాసేపట్లో కృష్ణ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.
-
కృష్ణకు నివాళులర్పించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ నివాళులు అర్పించారు. అనంతరం మహేష్‌బాబు చేయి పట్టుకుని ఆయనకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అటు ఏపీ మంత్రి రోజా కూడా కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు.
-
పద్మాలయా వద్ద అభిమానుల తోపులాట
వీఐపీల కోసం పద్మాలయా స్టూడియోస్ వద్ద అభిమానులను అరగంట పాటు నిలిపివేయడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ఒక్కసారిగా స్టూడియో లోపలకు అభిమానులు దూసుకుపోతున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారు.
-
మహేష్‌ను కౌగిలించుకున్న సీఎం జగన్
పద్మాలయా స్టూడియోకు చేరుకున్న సీఎం జగన్ సూపర్‌స్టార్ కృష్ణ పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. మహేష్ బాబును ఆలింగనం చేసుకుని ఓదార్చారు. సీఎం జగన్ వెంట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ భరత్ కూడా ఉన్నారు.
-
కృష్ణ పార్ధివ దేహానికి మంత్రి తలసాని నివాళులు
పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్ స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.
-
పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు.
-
కృష్ణకు నివాళులర్పించిన బాలయ్య
పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి హీరో నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.
-
పద్మాలయాకు చేరుకున్న మహేష్‌బాబు
పద్మాలయా స్టూడియోస్‌కు హీరో మహేష్‌బాబు తన కుటుంబంతో సహా చేరుకున్నాడు. కృష్ణ భౌతికకాయానికి మహేష్ సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార నివాళులు అర్పించారు.
-
పద్మాలయాకు చేరుకున్న పలువురు ప్రముఖులు
పద్మాలయా స్టూడియోస్‌లో సూపర్‌స్టార్ కృష్ణ పార్ధివ దేహానికి నటుడు అలీ, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు మణిశర్మ నివాళులర్పించారు.
-
నేడు షూటింగులు బంద్
సూపర్‌స్టార్ కృష్ణ మృతికి సంతాపంగా నేడు టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్ చేశారు. అటు పలు జిల్లాలలో సినిమా షోల ప్రదర్శన కూడా క్యాన్సిల్ చేశారు.