Sundaram Master Trailer : వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాడు. సుందరం మాస్టర్ పేరుతో ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కింది. ఇందులో వైవా హర్ష హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో దివ్య శ్రీపాద, శాలిని నంబూ, శ్వేత వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రవితేజ నిర్మించడం గమనార్హం. టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఈ మధ్య ఈ సినిమా ప్రమోషన్స్ తో మరింత హైప్ తెచ్చుకుంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇంగ్లీష్ వచ్చిన ఒక గిరిజన గ్రామానికి.. అసలు ఇంగ్లీషే రాని ఒక సోషల్ టీచర్ ను ప్రభుత్వం ఏరికోరి పంపుతుంది. అందుకు కారణం అతడు నల్లగా ఉంటాడు కాబట్టి. అతడే సుందరం. ఆ గ్రామంలో అమ్మాయిలకు నల్లవారు అంటే అదోరకమైన మక్కువ. అందుకే సుందరాన్ని అతిసుందరుడు గా భావించి రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు. అయితే సుందరాన్ని ఆ ఊరికి పంపడానికి కారణం.. ఆ ఊరిలో ఏదో తెలియని రహస్యం ఉందని సుందరానికి తెలుస్తోంది. ఇక అదేంటి అనేది తెలుసుకోవడానికి సుందరం పడే పాట్లు చూపించారు. ఇక తనను.. గిరిజనులు నమ్మడానికి పరీక్షలు పెడతారు. అందులో సుందరం పాస్ అయ్యాడా.. ? ఆ గ్రామంలో ఉన్న రహస్యం ఏంటి.. ? గిరిజనులు ఏం దాస్తున్నారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వైవా హర్ష కామెడీ సినిమాకు హైలైట్ గా నిలిచేలా ఉంది. కొన్ని పంచ్ లు ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 23 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రవితేజ నిర్మాతగా.. వైవా హర్ష హీరోగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.