Vaarahi: అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి దాదాపు పాతికేళ్లు కావస్తోంది. తొలి చిత్రం ‘ప్రేమకథ’కు రామ్ గోపాల్ వర్మే డైరెక్టర్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కూడా సుమంత్ కు పేరు తెచ్చిపెట్టిన చిత్రాలను చేతి వేళ్ళ మీదే లెక్కించొచ్చు. ‘సత్యం’తో మొదటి హిట్ అందుకున్న సుమంత్ ఆ తర్వాత చేసిన సినిమాలలో ‘గౌరి, మహానంది, గోదావరి, మధుమాసం, గోల్కొండ హైస్కూల్, మళ్ళీ రావా’ కాస్తంత గురింపును తెచ్చిపెట్టాయి. తన తాతయ్య తోనూ, మావయ్యతోనూ చేసిన సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అయినా సుమంత్ తో సినిమాలు తీసే నిర్మాతలు ఇప్పటికీ ఉండటం ఆశ్చర్యకరం. సహజంగా అతిథి పాత్రల జోలుకు వెళ్ళని సుమంత్ మొదటి సారి… ఎన్టీయార్ బయోపిక్ రెండు భాగాల్లోనూ తన తాతయ్య అక్కినేని గా అభినయించాడు. దానికి పేరు రావడంతో… ఇదేదో బాగుందని అనుకున్నాడేమో… ఆ తర్వాత మరో రెండు సినిమాలలో అతిథి పాత్రలకు మించి ప్రాధాన్యమున్న పాత్రలను చేశాడు. అవే ‘సీతారామం’, ‘సార్’.
‘సీతారామం’ మూవీలో బ్రిగేడియర్ విష్ణుశర్మగా నటించిన సుమంత్… అది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అనే విషయాన్ని ముందుగా చెప్పలేదు. ఇక ‘సార్’ విషయానికి వస్తే… అసలు అతను ఆ సినిమాలో నటిస్తున్న విషయాన్నే జనాలకు తెలియకుండా చిత్ర బృందం గోప్యంగా ఉంచింది. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఇప్పుడు సుమంత్ కు ఇలాంటి పాత్రలు అనేకం లభించే ఆస్కారం ఉంది. దాంతో… సుమంత్ ఇక మీదట సోలో హీరోగా నటించడేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… సుమంత్ సోలో హీరోగా నటించిన సినిమా ‘కపటధారి’ థియేటర్లలో విడుదలై చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయింది. ఆ తర్వాత అతను నటించిన ‘మళ్ళీ మొదలైంది’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇదిలా ఉంటే… సుమంత్ నటించిన కొన్ని సినిమాలు చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. మలయాళ చిత్రానికి రీమేక్ అయిన ‘అనగనగా ఒక రౌడీ’ దాదాపు నాలుగేళ్ళ క్రితం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా, విడుదలకు మాత్రం నోచుకోలేదు. అలానే ఆ మధ్యలో ‘అహం రీబూట్’ అనే సినిమాను సుమంత్ చేశాడు. ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్ చాలాకాలంగా లేదు. ఈ రెండు కాకుండా ఈ మధ్యలో ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘వారాహి’ అనే సినిమాలో సుమంత్ హీరోగా నటించాడు. ఈ డివోషనల్ బేస్డ్ మూవీ ప్రోగ్రెస్ ఏమిటనేది కూడా ఇంకా తెలియరాలేదు. సుమంత్ సోలో హీరోగా నటించిన సినిమాల పరిస్థితి ఇలా ఉండటంతో. అందరికీ ఇకపై అతను ఇలాంటి రిస్క్ లకు దూరంగా ఉంటాడేమో ననే సందేహాం కలుగుతోంది.