మన తెలుగు సినిమాలు రికార్డులు బద్దలు కొడుతూ సాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలు నంబర్లు హల్ చల్ చేస్తూ ఉంటాయి. దక్షిణాదిన టాలీవుడ్ నంబర్ వన్ సినిమా రంగం అంటూ ప్రచారాలూ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ, మన టాప్ స్టార్స్ సినిమాలకు వస్తున్న వసూళ్ళ వివరాలు అధికారమో అనధికారమో తెలియడం లేదు. పైగా ఎవరికి వారు అంతా ఇంతా అంటూ టముకు వేస్తున్నారు. ఇక టీజర్స్, ట్రైలర్స్ విడుదలయినప్పుడయితే, గంటల లెక్కన వ్యూస్, లైక్స్ సంఖ్యలు పెంచేసుకుంటూ రికార్డు అంటూ జబ్బలు చరచుకోవడమూ చూస్తున్నాం. వీటిలో నిజం ఎంత? అన్న అనుమానాలూ పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ వసూళ్ళు కానీ, టీజర్స్, ట్రైలర్స్ కు వస్తున్న వ్యూస్, లైక్స్ కానీ నిజాం కాదా? ఇదే అనుమానం చాలామందికి కలుగుతోంది. కానీ, టాప్ స్టార్స్ ఫ్యాన్స్ మాత్రం ఈ లెక్కలు చూసి ‘మాది గొప్ప అంటే, మాది గొప్ప’ అంటూ సోషల్ మీడియాలోనే చాటింపు వేసుకుంటూ సంబరపడుతున్నారు. ‘ఈ నంబర్లన్నీ మేనేజ్ చేసేవే’ అంటున్నారు ఆ టెక్నిక్ తెలిసినవాళ్ళు. మరి వీటితో పనేంటి?
సోషల్ మీడియా నంబర్ గేమ్!
ఓ సినిమా విడుదల కాబోయేముందు, సదరు చిత్రానికి ఊపు తెచ్చే క్రమంలో ఈ ఫిగర్స్ మేజిక్ పనిచేస్తోందట. అందుకే మన సినీజనం సోషల్ మీడియాలో నంబర్స్ మేజిక్ కోసం బాగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇదంతా తమ సినిమాల పబ్లిసిటీలో భాగంగా సినీజనం ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా రాకముందు మొన్నటి దాకా రేడియోలు, టీవీలలో తమ చిత్రాల పబ్లిసిటీ కోసం సినీజనం ఆధారపడేవారు. ఇప్పటికీ వాటిలోనూ జాతర కొనసాగుతూనే ఉంది. అధిక సంఖ్యాకుల చేతుల్లో ‘స్మార్ట్ ఫోన్స్’ నాట్యం చేస్తున్న సమయమిది. దాంతో సోషల్ మీడియాలోనే ముందుగా తమ చిత్రాలకు సంబంధించిన ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు సినీజనం. తమ లుక్ కు, టీజర్ కు, లిరికల్ సాంగ్ కు అన్ని వ్యూస్, ఇన్ని లైకులు వచ్చాయంటూ డప్పు వేసుకోవలసిందే. ఈ టముకు వేయడానికి కూడా ఓ టెక్నిక్ ప్రకారం మనకు కావలసినంత సంఖ్యను పెంచుకోవచ్చునట! దానికీ సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేకమైన రేటు ఉంటుందట. ఇటీవల విడుదలైన ఓ టాప్ స్టార్ సినిమా టీజర్ కొన్ని గంటల్లోనే ‘మిలియన్ల వ్యూస్’ సాధిస్తోంది. దీనిని ఇతర హీరోల అభిమానులు సహించలేక, ఏ తీరున ఆ నంబర్లు వస్తున్నాయో విడమరిచి చాటింపు వేస్తున్నారు. అంతకు ముందు ఈ చాటింపు రాయుళ్ళ అభిమాన హీరోల సినిమాలకూ ఇదే తీరున ‘నంబర్ల గేమ్’ సాగించిన విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవరికి వారు తమ హీరోకు ఇంత ఫిగర్ రావాలి, అంత నంబర్ ఉండాలి అంటూ దానికోసం ఖర్చు కూడా చేస్తున్నట్లు సమాచారం. కొందరు నిర్మాతలు తమ చిత్రాలకు క్రేజ్ రావడానికి సొంతగా పి.ఆర్ వ్యవస్థ ద్వారా ఈ సోషల్ మీడియా నంబర్ల గేమ్ కోసం ఖర్చు చేసుకుంటూ ఉంటే, టాప్ స్టార్స్ కు వారి అభిమానుల అండ కూడా లభిస్తూ ఉండడం విశేషం!
బాక్సాఫీస్ నంబర్స్ మ్యాజిక్!
ఇక బాక్సాఫీస్ లెక్కల దగ్గరకు వస్తే, వాటిలోనూ అబద్ధాల జాతరే సాగుతోంది. యన్టీఆర్, ఏయన్నార్ టాప్ స్టార్స్ గా రాజ్యమేలుతున్న కాలంలో వారి చిత్రాలు ఏయే థియేటర్లలో విడుదల కాబోతున్నాయో, ఓ రోజు ముందుగా ప్రకటించేవారు. అభిమానులు సదరు చిత్రాల ‘సీటింగ్ కెపాసిటీ, రేట్ల’ ను బట్టి ఏ థియేటర్ ఫుల్ అయితే ఎంత వసూలు చేస్తుందో యోచించేవారు. పైగా అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే బుకింగ్ లో టిక్కెట్లు అమ్మేవారు. బుకింగ్ లో కొన్ని టిక్కెట్లు ఇచ్చి, కొన్ని బయట బ్లాక్ మార్కెట్ లోనూ అమ్మే సంప్రదాయాలు అప్పట్లో ఉండేవి. కానీ, సినిమా థియేటర్ల టిక్కెట్ల రేట్లపైనే లెక్కలు కట్టేవారు. డెయిలీ కలెక్షన్ రిపోర్ట్ (డీసీఆర్)ను అనుసరించే లెక్కలు చెప్పేవారు. ఈ లెక్కల్లో థియేటర్ల వారు ‘ఎక్స్ ట్రా’ వేసిన సీట్లను చేర్చేవారు కాదు. తమ థియేటర్ లో రిలీజయిన సినిమా వసూళ్ల నిమిత్తమై డిస్ట్రిబ్యూటర్ నుండి వచ్చే రెప్రజెంటివ్ ను మేనేజ్ చేసి, కేవలం కెపాసిటీని అనుసరించే డీసీఆర్ రాసేవారు. ఆ లెక్కల ప్రకారమే ఆ రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల వసూళ్ళ వివరాలు పక్కాగా నయాపైసలతో సహా ప్రకటించేవారు. తరువాతి తరం హీరోల హవా వీయడం మొదలు పెట్టిన తరువాత నుంచీ అభిమానులను ఆనందింప చేయడానికి అన్నట్టు వసూళ్ళ ప్రకటనల్లో తప్పుడు అంకెలు ప్రకటించడం మొదలయింది. అదే యన్టీఆర్, ఏయన్నార్ కాలంలో ఏ ఊరిలో ఎన్ని థియేటర్లు, ఎంత వసూలయింది. ఏ రోజున ఎన్ని టిక్కెట్లు తెగాయి. అన్న లెక్కలు కూడా పక్కాగా ఉండేవి. కాబట్టి, అంకెల గారడీ చేయడానికి వీలుండేది కాదు. కానీ, శ్లాబ్ సిస్టమ్ వచ్చిన తరువాత నుంచీ బి,సి సెంటర్స్ లో కొత్త సినిమాలకు మొదటి రోజున ఎక్కడ కూర్చుని చూసినా, ఒకే రేటు నిర్ణయించి దోపిడీ చేసేవారు. ఇది అనధికారంగానే. ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేస్తూ ఈ దందా సాగించేవారు. దాంతో వసూళ్లలో అడ్డదిడ్డంగా నంబర్లు వేసేవారు. తరువాత ప్రభుత్వమే పెద్ద హీరోల చిత్రాలకు వారం వరకు అధిక రేట్లను అమలు చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచీ ఈ వసూళ్ళ ఫిగర్స్ మరింత మ్యాజిక్ చేస్తున్నాయి. ఈ మధ్యే వచ్చిన టాప్ హీరో సినిమా అంత వసూలు చేసింది, ఇంత లాగేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా చాటింపు వేసుకుంటున్నారు. కానీ, సదరు చిత్రం అంతకు ముందు అదే హీరో నటించిన ప్లాఫ్ సినిమా కంటే తక్కువగానే వసూలు చేసిందని అసలు లెక్కలు చెబుతున్నాయి.
అయ్యో… అభిమానులు…
మరి, ఈ లెక్కల గారడీతో ఎవరికి ఆనందం? ఈ లెక్కల్లో తప్పులు కుప్పలు కుప్పలుగా ఉన్నా, అవి వారికి తెలిసినా, అమాయకపు అభిమానులు మా హీరో సినిమా ఇంత వసూలు చేసిందంటూ, ఈ సోషల్ మీడియాలో కనిపించే ఫిగర్లనే పట్టుకొని చాటింపు వేస్తుంటారు. అయితే అసలు నిజాలను ఇతర హీరోల ఫ్యాన్స్ బయట పెడతారు. దాంతో, డూప్ పబ్లిసిటీతో చాటింపేసి సంబరపడ్డ అభిమానులు, తమ అపోజిట్ హీరో సినిమా వసూళ్ల అసలు గుట్టు బయట పెట్టాలని ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఇక వికీపీడియాలోనూ తమ హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన నంబర్లు ఇవేనంటూ కొందరు ఫ్యాన్స్ అందిస్తూ ఉంటారు. వాటిని ఆ వేదిక ప్రచురిస్తోంది. అయితే ఇందులో తమ ప్రమేయం లేదంటూ ఎక్కడో చిన్న నోట్ పెట్టి ఉంటుంది. కానీ, ఆ నంబర్లే అసలైనవని వాదించే సినీజనమూ ఉన్నారు. వికీపీడియాలో కనిపించేదంతా నిజం కాదని, కొన్ని సినిమాల విడుదల తేదీలు చూస్తేనే తెలుస్తుంది. మరి అందులో ప్రచురితమయ్యే వసూళ్ళు కూడా నిజమేనని ఎలా నమ్మడం? ఈ అనుమానం చాలామంది అభిమానులకు కలుగుతూనే ఉంటుంది. కానీ, కొందరు అమాయకపు అభిమానులు మాత్రం ఆ లెక్కలు చూసే మురిసిపోతూ ఉంటారు.
బోగస్ నంబర్ల పంచాయితీ సమసిపోవాలంటే…
ఈ బోగస్ లెక్కల ఆట కట్టాలంటే టాప్ స్టార్స్ ఓ నిర్ణయానికి రావాలి. అసలు తమ సినిమాలకు అంత వచ్చింది, ఇంత వసూలైనాయి అన్న విషయాలను ప్రకటించడం ఆపేయాలి. ఏ సినిమా నచ్చితే, ఆ చిత్రాన్ని జనం ఆదరిస్తారు అన్న నమ్మకంతో వదిలేయాలి. ఇలా చేస్తే… హీరోల అభిమానులు నీరసించి పోతారేమో అనే సినీజనం ఈ నంబర్స్ గేమ్ ఆడుతున్నారు. అప్పుడే ఆ యా హీరోల కాల్షీట్స్ పట్టవచ్చన్నది వారి స్ట్రాటజీ. మరి, ఈ బోగస్ నంబర్స్ కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? అసలే రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వస్తున్నాయి. మరి, నంబర్ గేమ్స్ లో ఇంకెన్ని కొత్త పోకడలు చూడాలో? ఎందుకంటే, ఓ హీరో సినిమా వసూళ్లు నిజం కాదని ఇతర హీరోల అభిమానులు వాదిస్తున్నారు. అలాగే ఇంకో హీరో టీజర్ వ్యూస్, లైక్స్ అబద్ధమని వేరే ఫ్యాన్స్ అంటున్నారు. అభిమానుల మధ్య ఈ తరహా మాటల తూటాలు పేల్చుకోవడానికి మళ్ళీ సోషల్ మీడియానే వేదికవుతోంది. ఇప్పుడయితే కరోనా కారణంగా సినిమాలు వెనక్కు పోతున్నాయి. మరి టాప్ స్టార్స్ సినిమాలు విడుదలయ్యే సమయంలో మును ముందు ఇంకా ఎన్ని జిమ్మిక్స్ చేస్తారో చూద్దాం.