భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంస్కృతి కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకు విడాకుల పేరుతో విడిపోయి జీవిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారు. ఇక ఈ విడాకుల పర్వం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అన్నది నమ్మదగ్గ నిజం. ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు కొన్ని రోజులు ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఐదారేళ్లకే విబేధాల వలన విడిపోతున్నట్లు ప్రకటిస్తున్నారు. గతేడాది విడాకుల పర్వం చూసుకుంటే.. అక్కినేని నాగ చైతన్య- సమంత జంట. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడిపోతున్నట్లు ప్రకటించింది.
ఇక ఈ ఏడాది కోలీవుడ్ టీసర్ హీరో ధనుష్- ఐశ్వర్య జంట.. 18 ఏళ్ళ వైవాహిక జీవితం అనంతరం విడిపోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ జంట విడాకుల వెనుక బాలీవుడ్ హస్తం ఏమైనా ఉందా ..? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదేంటి ఈ జంటలకు, బాలీవుడ్ కి సంబంధం ఏంటి అంటే..?.. యాదృచ్చికంగా జరిగిందో, కావాలనే జరిగిందో తెలియదు కానీ .. ఈ హీరోలు బాలీవుడ్ బాట పట్టిన వెంటనే భార్యలకు విడాకులు ప్రకటించారు. నాగ చైతన్య, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో చై ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే చై విడాకులు ప్రకటించాడు. ఇదే విధంగా ధనుష్ కూడా ఇటీవల బాలీవుడ్ లో ‘ఆత్రాంగి రే’ చిత్రంతో ఎంటర్ అయ్యాడు.
యాదృచ్చికంగా ఈ సినిమా తరువాత ఆయన కూడా విడాకులు ప్రకటించాడు. దీంతో చాలామంది ఈ స్టార్ జంటల విడాకులకు, బాలీవుడే కారణమని నొక్కివక్కాణిస్తున్నారు. బాలీవుడ్ లో డైవోర్స్ సర్వ సాధారణంగా మారిపోయాయి. నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం , నచ్చకపోతే విడాకులు తీసుకోవడం బాలీవుడ్ లోని కొంతమంది తారలకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ బాట పట్టి ఇలాంటి నిర్ణయాలను తీసుకొంటున్నారని పలువురు బాహాటంగానే అంటున్నారు. ఏదిఏమైనా ఒక రకంగా చెప్పాలంటే అందులోను నిజం లేకపోలేదు. వివాహ వ్యవస్థను ఈజీగా తీసుకొనే ఇండస్ట్రీకి వెళ్లి వీరు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
