Site icon NTV Telugu

#SSMB29 : 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు

#ssmb29

#ssmb29

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్‌ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

Also Read : Vijay-Rashmika: మూడోసారి ముచ్చటగా జంటగా స్క్రీన్ షేర్..!

ముసాలియా, రాజమౌళి టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. శక్తివంతమైన కథనాలు, అద్భుతమైన విజువల్స్, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో రాజమౌళి అసాధారణ ప్రతిభ కనబరుస్తారని కొనియాడారు. తూర్పు ఆఫ్రికా అంతటా పరిశీలించిన అనంతరం షూటింగ్ కోసం తమ దేశాన్ని ఎంచుకోవడం గర్వకారణమని అన్నారు. మాసాయి మారా మైదానాలు, నైవాషా సరస్సు, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రసిద్ధ ప్రాంతాలు సినిమాలో భాగమవనున్నాయని ఆయన వెల్లడించారు.

అలాగే ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఇది రాజమౌళి కెరీర్‌లోనే కాకుండా భారతీయ సినిమాకి కొత్త రికార్డు కానుంది. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌ ఫస్ట్ లుక్‌ను నవంబరులో విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.

Exit mobile version