SS Thaman Comments on Composing music for Remake Movies: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో తమిళ నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, అలాగే ప్రమోషనల్ స్టఫ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై అందరినీ మెప్పించింది. ఈ సందర్భంగా తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రీమేక్ సినిమాలకు సంగీతం అందించడం అనేది ఛాలెంజ్ కదా? అని థమన్ ను అడిగితే అలా చేయడం ఎవరెస్ట్ ని అధిరోహించడం లాంటిదని చెప్పుకొచ్చారు. తనకు పవన్ కళ్యాణ్ గారితో మూడు సినిమాలూ రీమేక్ లే వచ్చాయన్న ఆయన వకీల్ సాబ్ గానీ, భీమ్లా నాయక్ గానీ, బ్రో గానీ సంగీతం పరంగా నేను చేయాల్సింది చేస్తున్నానని, నేను ఇచ్చే సాంగ్స్ సినిమాకి హెల్ప్ చేస్తాయని అన్నారు.
Samajavaragamana: మొదటి రోజు కంటే 11వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన సామజవరగమన
వకీల్ సాబ్ లో మగువా మగువా వంటి పాటని కూడా మాసీగా ఫైట్ కి ఉపయోగించామన్న ఆయన బ్రో అనే సినిమా విడుదలయ్యాక ఎంతోమందిని కదిలిస్తుందని అన్నారు. ఈ సినిమాలో హత్తుకునే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయని అన్నారు. త్రివిక్రమ్ గారి రచన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది, ఇక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే సహజంగానే సినిమా స్థాయి పెరుగుతుందని అన్నారు. ఇక సినిమా మాతృక ప్రభావం మీ సంగీతంపై ఉందా? అని అడిగితే అసలు ఒరిజినల్ ఫిల్మ్ లో పాటల్లేవు, కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగా చేశారు. అక్కడ ఆ పాత్ర సముద్రఖని గారు చేశారు కాబట్టి అది సరిపోతుంది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇక పవన్ తెర మీద కనిపిస్తే చాలు సంగీతం అడిగేస్తాం కదా అందుకే బ్రో శ్లోకం స్వరపరిచామని అన్నారు.. నేపథ్య సంగీతం పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నాను. ఉన్నత స్థాయిలో ఉంటుందని థమన్ వెల్లడించారు.