దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఉక్రెయిన్ లో జరుగుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ఈ నెల 19న ముగియనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ లపై ఓ పాటను భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ కు ప్యాకప్ చెప్పనుంది చిత్రబృందం. తదనంతరం గ్రాఫిక్స్ పనులపై ఫోకస్ పెట్టనున్నారు జక్కన్న.
కాగా రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
