ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు ‘శ్రీరామజయం’ అని రాయడం తెలుగువారికి ఓ సంప్రదాయం. అదే తీరున తెలుగు చిత్రసీమలోనూ శ్రీరామనామమే విజయగీతం పాడించింది. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రంగా ‘ఆలమ్ ఆరా’ నిలచింది. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలయింది. మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు దక్షిణాదిన కూడా ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఆయన అసోసియేట్ గా ఉన్న తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి కూడా మద్దతు పలికారు. ఆ యేడాది మార్చి 28న శ్రీరామనవమి పండగ వచ్చింది. అప్పుడే తొలి దక్షిణాది చిత్రానికి శ్రీకారం చుట్టినట్టు సమాచారం. తొలి దక్షిణాది చిత్రంగా తెలుగు, తమిళ మిశ్రమ భాషల్లో ‘కాళిదాస’ రూపొందింది. ఆ సినిమా 1931 అక్టోబర్ 31న విడుదలయింది. తరువాత సంపూర్ణ తెలుగు చిత్రంగా ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న జనం ముందు నిలచింది. ఈ రెండు చిత్రాల తరువాత వచ్చిన చిత్రం ‘రామ పాదుకా పట్టాభిషేకం’. ఇదే తెలుగువారి తొలి శ్రీరామకథాచిత్రం అని చెప్పవచ్చు. ఇందులో శ్రీరామునిగా యడవల్లి సూర్యనారాయణ నటించారు. అంటే తెలుగు తెరపై శ్రీరామునిగా కనిపించిన మొట్టమొదటి నటుడు యడవల్లి అన్న మాట!
తొలి ఘనవిజయంలోనూ..
ఇక తెలుగునాట తొలి ఘనవిజయం సాధించిన చిత్రంగా ‘లవకుశ’ (1934) నిలచింది. సి.పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ చిత్రంలో పారుపల్లి సుబ్బారావు శ్రీరామునిగానూ, సీనియర్ శ్రీరంజని సీతగానూ నటించారు. ఈ చిత్రం అపూర్వ విజయం సాధించింది. శ్రీరామునిగా పారుపల్లికి మంచి పేరు లభించింది. తరువాత మరి కొన్ని తెలుగు చిత్రాలలో శ్రీరామ పాత్రలు ప్రదర్శితమయ్యాయి. అలా శ్రీరామ పాత్రలో పేరు సంపాదించిన వారిలో భీమరాజు గురుమూర్తి రావు (లంకాదహనం – 1936) ఒకరు. 1945లో ‘పాదుకా పట్టాభిషేకం’ చిత్రాన్ని కడారు నాగభూషణం తెరకెక్కించారు. ఈ చిత్రంలో సీఎస్సార్ ఆంజనేయులు శ్రీరామ పాత్రలో కనిపించారు. సీఎస్సార్ కు శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలు ఎనలేని పేరు సంపాదించి పెట్టాయి.
తిరుగులేని తారకరాముడు!
తెలుగు తెరపై ఎందరు శ్రీరాముని పాత్రను ధరించినా, తెలుగువారికి శ్రీరాముడు అనగానే చప్పున గుర్తుకు వచ్చేది నందమూరి తారక రాముడే! యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీరామునిగా కనిపించిన చిత్రం ‘చరణదాసి’ (1956). ఈ చిత్రంలో కథానాయికకు ఓ స్వప్నం వస్తుంది. అందులో తాను సీతగా, భర్త రామునిగా కనిపిస్తారు. ఆ కలలో సీతను అగ్నిపరీక్షకు ఆదేశించే శ్రీరాముని సన్నివేశం కనిపిస్తుంది. అందులో తొలుత వనవాసరామునిగా, తరువాత అయోధ్య రామునిగా యన్టీఆర్ కనిపిస్తారు. అంజలీదేవి సీతగా అభినయించారు. ఆ కలలోనే, “కొలిచేను లోకాలు కనుమా…” పాటలో యన్టీఆర్, అంజలీదేవి రాచరికపు ఆభరణాలు ధరించి కనువిందు చేశారు. నిజానికి ‘మాయాబజార్’ కంటే ముందే ‘చరణదాసి’ విడుదలయింది. ఈ సినిమా ప్రదర్శించిన సినిమా హాళ్ళ ముందు యన్టీఆర్, అంజలీదేవి శ్రీరామ,సీతగా ఉన్న కటౌట్స్ ను పెట్టారు నిర్మాత ఎ.శంకర రెడ్డి. ఆ కటౌట్స్ చూసే ‘చరణదాసి’ని జనం విశేషంగా ఆదరించారని ఇప్పటికీ చెబుతారు. శంకర రెడ్డి తమ లలితా శివజ్యోతి పతాకంపై తెలుగువారి తొలి రంగుల చిత్రంగా ‘లవకుశ’ను తెరకెక్కించారు. 1934 నాటి ‘లవకుశ’కు దర్శకత్వం వహించిన సి.పుల్లయ్య దర్శకత్వంలోనే 1958లో ‘లవకుశ’ ఆరంభమయింది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యమైంది. అలాగే ఈ చిత్రంలో కొంతభాగాన్ని సి.పుల్లయ్య తనయుడు సి.ఎస్.రావు దర్శకత్వంలో తెరకెక్కించారు. 1963 మార్చి 29న విడుదలై అఖండ విజయం సాధించింది ‘లవకుశ’. ఈ చిత్రానికి ముందు 1957లో యన్టీఆర్ ‘సంపూర్ణ రామాయణం’అనే తమిళ చిత్రంలో శ్రీరామునిగా నటించారు. ఆ సినిమా అప్పట్లో తమిళనాట ఘనవిజయం సాధించింది. అందువల్ల ‘లవకుశ’ను కూడా తమిళంలో నిర్మించారు.
యన్టీఆర్, అంజలీదేవి ఆ సినిమాలోనూ రామ,సీత పాత్రల్లో కనువిందు చేశారు. తమిళనాట కూడా ‘లవకుశ’ అద్భుత విజయం చవిచూసింది. ఇదే సినిమాను హిందీ, బెంగాల్ భాషల్లో అనువదించగా అక్కడా రజతోత్సవాలు చేసుకుంది. ఇంతలా ఓ పౌరాణిక చిత్రం ఉత్తరాదిన, దక్షిణాదిన జయకేతనం ఎగురవేయడం ఈ నాటికీ అపూర్వమే! ‘లవకుశ’ చిత్రంతో అపర శ్రీరామచంద్రునిగా యన్టీఆర్ జనం మదిలో నిలచి పోయారు. అందువల్ల కొన్ని సాంఘిక చిత్రాలలోనూ శ్రీరాముని గెటప్ లో కనిపించి కనువిందు చేశారు రామారావు. అసలే ఆయన పేరులో ‘తారకరామ’ నామం ఉంది. ఇక తిరుగేముంది? అందువల్లనే కాబోలు యన్టీఆర్ ‘రాముడు’ అన్న టైటిల్స్ తో రూపొందిన అనేక చిత్రాలలో నటించారు. అంతేకాదు, అపురూపమైన విజయాలూ సాధించారు. ఇక ‘శ్రీకృష్ణ సత్య’ (1971), ‘శ్రీరామాంజనేయయుద్ధం’ (1975), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పౌరాణిక చిత్రాలలోనూ యన్టీఆర్ శ్రీరామునిగా నటించి అలరించారు. శ్రీరామ పాత్రలో యన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. అందుకే ఈ నాటికీ తెరపై ఆయన తిరుగులేని తారకరామునిగానే నిలిచారు.
యన్టీఆర్ వారసులు కూడా..
చిత్రమేమంటే, నటరత్న నటవారసునిగా అరుదెంచిన బాలకృష్ణకు ఆరంభంలో కొన్ని పరాజయాలు పలకరించాయి. శ్రీరాముని గెటప్ లో బాలయ్య కనిపించిన ‘మంగమ్మగారి మనవడు’ అనూహ్య విజయంతో ఆయన టాప్ స్టార్ గా నిలిచారు. తరువాత ‘సీతారామకళ్యాణం’ (1986)లో ఓ పాటలో శ్రీరామునిగా కనిపించారు. ఆ పై ‘సాహస సామ్రాట్’లోనూ ఓ సీన్ లో శ్రీరామునిగా కనిపించారు బాలయ్య. అలాగే బాపు-రమణ చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించి మెప్పించారు బాలకృష్ణ. ఇక యన్టీఆర్ నటవంశంలో మూడోతరం హీరోగా వచ్చిన జూనియర్ యన్టీఆర్ ‘రామాయణం’ (1997) చిత్రంలో రామునిగానే కనిపించారు. ఇలా నందమూరి నటవంశంలో మూడు తరాల హీరోలకూ శ్రీరామ పాత్ర అచ్చివచ్చిందనే చెప్పాలి.
మరి కొందరు…
అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి ‘ధర్మపత్ని’ (1941) అనే చిత్రంలో చిన్న పాత్రలో తెరపై కనిపించారు. అయితే 1944లో రూపొందిన ‘సీతారామజననం’లో రాముని పాత్రతోనే అక్కినేని అసలైన నటజీవితం ఆరంభమైందని చెప్పాలి. అలా ఆయనకూ రామ పాత్ర కలసి వచ్చింది. ఇక తొలి నుంచీ యన్టీఆర్ పౌరాణిక చిత్రాలలో వేరే పాత్రలు ధరించినప్పుడు కాంతారావు శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో కనిపించేవారు. అలా యన్టీఆర్ ‘ఇంద్రజిత్ (సతీసులోచన)’ (1961)లోనూ, తరువాత ‘వీరాంజనేయ’లోనూ కాంతారావు శ్రీరామునిగా నటించారు. యన్టీఆర్ ‘సీతారామకళ్యాణం’లో శ్రీరామునిగా నటించిన హరనాథ్ తరువాత ‘శ్రీరామకథ’లోనూ శ్రీరామ పాత్రలో అభినయించారు. బాపు ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్ బాబు శ్రీరామపాత్రలో నటించి అలరించారు. తరువాత ‘దేవాలయం’లో కాసేపు శ్రీరాముని గెటప్ లో కనిపించారు. బాపు ‘సీతాకళ్యాణం’లో శ్రీరామునిగా నటించిన రవి, తరువాత ‘సీతారామ వనవాసము’, ‘దశావతారములు’ చిత్రాల్లో శ్రీరామునిగా నటించారు. ఏయన్నార్, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన భక్తిరస చిత్రం ‘శ్రీరామదాసు’లో సుమన్ శ్రీరామునిగా కనిపించి అలరించారు.
‘బాహుబలి’ ఘనవిజయంతో ఆల్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ప్రస్తుతం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’లో శ్రీరాముని పాత్రలోనే కనిపించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెందరు శ్రీరామ పాత్రలో కనిపించి కనువిందు చేస్తారో చూద్దాం.