బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలను సగటు ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పదజాలంతో కూడిన సినిమా రూపొందించడం సరికాదు అన్నారు.
ట్రైలర్ అంత అసభ్యంగా ఉంటే సినిమా ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. అసలు ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ ఎలా అనుమతించింది. ఇదో అడల్ట్ సినిమా.. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. చిత్ర బృందం యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు. లేకుంటే తెలుగు రాష్ట్రాల మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. మరి దీనిపై చిత్రబృందం ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.