Site icon NTV Telugu

Sree Leela: బంపరాఫర్ పట్టేసింది.. ఏకంగా పాన్ ఇండియా సినిమా

Sree Leela Rapo20

Sree Leela Rapo20

Sree Leela To Romance Ram Pothineni In RAPO20: ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీల.. ఆ సినిమా విజయం సాధించకపోయినా, అందులో తన అందంతో పాటు అభినయంతోనూ కట్టిపడేయంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తన రెండో సినిమాతోనే.. మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య కూతురిగా నటించే అవకాశాన్ని సైతం అందిపుచ్చుకున్న ఈ కుర్ర హీరోయిన్, మరో రెండు చిత్రాల్ని (జూనియర్, అనగనగా ఒక రోజు) లైన్‌లో పెట్టింది. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో బంపరాఫర్‌ని అందిపుచ్చుకుంది. అది కూడా పాన్ ఇండియా సినిమా ఆఫర్!

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా కథ పాన్ ఇండియా అప్పీల్ కలిగి ఉండటంతో.. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే.. ఇందులో కథానాయికగా ఎవరిని తీసుకోవాలన్నదే మేకర్స్‌కి పెద్ద సవాలుగా మారింది. మంచి క్రేజ్ ఉండటంతో పాటు రామ్‌కు సరిపడ జోడీ ఎవరా? అని కొన్నాళ్లు జల్లెడ పట్టారు. తొలుత బాలీవుడ్ నుంచి ఓ భామని దింపాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత వెనకడుగు వేశారు. సౌత్‌లోనే కొందరిని పరిశీలించిన అనంతరం.. శ్రీలీలని ఎంపిక చేశారు. యువతలో మంచి ఫాలోయింగ్ ఉండటం, అభినయంతోనూ మెప్పించగలదు కాబట్టి.. పర్ఫెక్ట్‌గా సూటవుతుందని ఈ అమ్మడిని తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. అఖండ తర్వాత బోయపాటి ఈ సినిమా చేస్తుండటం, రామ్‌కి కూడా మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి, ఈ జోడీ ఎలాంటి సినిమాతో రాబోతోందో చూడాలి.

Exit mobile version