Sr. Samudrala Jayanthi : “జయ జయ శ్రీరామా…” (జయసింహ), “నారాయణ హరి నారాయణ…” (చెంచులక్ష్మి), “దేవదేవ ధవళాచల మందిర గంగాధర…” (భూ కైలాస్), “సీతారాముల కళ్యాణం చూతము రారండి…” (సీతారామకళ్యాణం), “జగదభి రాముడు… శ్రీరాముడే”, “రామకథను వినరయ్యా…”, “వినుడు వినుడు రామాయణగాథ…”, “శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…” (లవకుశ) – ఇలా భక్తి పారవశ్యం కురిపించే గీతాలు పలికించినా…
“జగమే మాయా బ్రతుకే మాయా…” అంటూ విషాదం చిలికించినా, “చిగురాకులలో చిలకమ్మా…” అంటూ పల్లవింప చేసినా ఆయనకే చెల్లింది.
“ఓరోరీ…మాయాద్యూత విజయ, మధుమదన్మోత్తా… దుర్యోధనా…” అంటూ భీమసేనునితోనూ, “బానిసలు… బానిసలకు ఇంత అహంభావమా?…” అని దుర్యోధనునితోనూ జనం మెచ్చేలా ‘పాండవవనవాసము’లో పలికించినా, “దిగ్దిశాంత విశ్రాంత యశోవిరాజితమై… నవఖండ భూమండల పరివ్యాప్తమై…”అంటూ ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో సుయోధనుని నోట సమాసభూయిష్టమైన సంభాషణలు వల్లింప చేసినా అనితరసాధ్యం అనిపించేలా చేసిందీ ఆయనే!
ఆ మహా రచయిత పేరు సముద్రాల రాఘవాచార్య. 1902 జూలై 19న గుంటూరు జిల్లా పెదపులిపర్రులో జన్మించారాయన. పండిత వంశంలో కన్నుతెరవడం వల్ల పిన్నవయసులోనే పురాణ పరిజ్ఞానం విశేషంగా అబ్బింది. తొమ్మిదివ తరగతి చదువుతూ ఉండగానే కవిత్వం రాయడం మొదలు పెట్టారు రాఘవాచార్య. భాషాప్రవీణ పూర్తయ్యాక, ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకూ వెళ్ళారు. అప్పట్లో రాఘవాచార్య అవధానాలు కూడా చేసి మంచి పేరు గడించారు. ఆయన పేరు విన్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గుంటూరు పిలిపించారు. అక్కడే కొసరాజు రాఘవయ్య చౌదరి, గూడవల్లి రామబ్రహ్మంతో సముద్రాలకు పరిచయమయింది. వీరిని మద్రాసు పంపి ‘కమ్మవారి చరిత్ర’పై పరిశోధన చేయమని కుప్పుస్వామి చౌదరి నియమించారు. అలా చెన్నపట్టణం చేరిన సముద్రాల తరువాత గుంటూరు, విజయవాడ, మద్రాసు ఇలా తిరుగుతూ వచ్చారు. గూడవల్లి రామబ్రహ్మం సహవాసం వల్ల సినిమాలపై ఆసక్తి కలిగింది. ‘కనకతార’ చిత్రానికి మాటలు, పాటలు రాసి అలరించారు. ఆ తరువాత బి.యన్.రెడ్డి తెరకెక్కించిన “సుమంగళి, వందేమాతరం, దేవత” చిత్రాలకు పాటలు, మాటలు పలికించి ఆకట్టుకున్నారు. కేవీ రెడ్డి తొలి చిత్రం ‘భక్త పోతన’కు, విజయావారి మొదటి సినిమా ‘షావుకారు’కు కూడా సముద్రాల వారి రచననే ఓ సొబగు తెచ్చింది.
అనేక చిత్రాలు సముద్రాల రాఘవాచార్య రచనతో విజయకేతనం ఎగురవేశాయి. వినోదవారి ‘దేవదాసు’కు సముద్రాల వారి సాహిత్యమే దన్నుగా నిలచింది. యన్.ఏ.టి. బ్యానర్ లో తొలి విజయంగా నిలచిన ‘జయసింహ’కు, అన్నపూర్ణవారి తొలి చిత్రం ‘దొంగరాముడు’కు కూడా సముద్రాల రచన తోడుగా సాగింది. సముద్రాల ఎన్ని చిత్రాలకు పాటలు, మాటలు రాసినా, ఆయన పేరు వినగానే తెలుగునాట ఈ నాటికీ కోవెలలలో వినిపించే భక్తిగీతాలే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలు “భూకైలాస్, దీపావళి, సీతారామకళ్యాణం, లవకుశ, నర్తనశాల, పాండవవనవాసము, శ్రీక్రిష్ణ పాండవీయం” మన మదిలో ముందుగా మెదలుతాయి.
మెగాఫోన్ పట్టి దర్శకునిగా “వినాయక చవితి, భక్త రఘునాథ్, బభ్రువాహన” చిత్రాలు రూపొందించారు. ఈ మూడు చిత్రాలలో యన్టీఆర్ నటించడం విశేషం. ‘భక్త రఘునాథ్’లో సముద్రాల వారి కోరికపైనే యన్టీఆర్ శ్రీకృష్ణునిగా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. “దేవదాసు, శాంతి, స్త్రీ సాహసం” వంటి చిత్రాల నిర్మాణంలోనూ సముద్రాల పాలు పంచుకున్నారు. ‘భక్త రఘునాథ్’లో ఓ పాటలో గొంతు కూడా కలిపారు. ఆయన కలం నుండి చివరగా జాలువారిన పాట, పద్మనాభం నిర్మించి, నటించిన ‘శ్రీరామకథ’ చిత్రంలోని “రామకథ శ్రీరామకథ…” అంటూ సాగేది. ఈ పాట రాసిన మరుసటి రోజునే అంటే 1968 మార్చి 16న ఆయన కన్నుమూశారు. తెలుగు చిత్రసీమలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించిన రచయితగా సముద్రాల రాఘవాచార్య నిలిచారు. హైదరాబాద్ ఫిలిమ్ నగర్ లో సముద్రాల రాఘవాచార్య విగ్రహం కూడా నెలకొల్పారు. ఇప్పటికీ సముద్రాల సీనియర్ జయంతి, వర్ధంతి సందర్భాల్లో అభిమానులు విగ్రహాన్ని పూలమాలలతో నింపుతూనే ఉండడం విశేషం!