(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు)
అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత దరి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేశారు. హాస్యంతోనూ అలరించారు. కరుణ రసం కురిపించి కన్నీరు పెట్టించారు. తనకు మాత్రమే సాధ్యమైన బాణీతో చెలరేగి పోయారు. ఇలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ తారస్థాయి చేరుకున్న వాణిశ్రీ ఆ రోజుల్లో ఎందరికో విజయనాయిక. ఏ మేటి నటులనైతే చూస్తే చాలు అనుకుందో, వారి సరసనే అదరహో అనిపించేలా అభినయించి అలరించారు వాణిశ్రీ.
ఇక ఆ నాటి వర్ధమాన కథానాయకులకు వాణిశ్రీ అదృష్ట హస్తం అనీ చెప్పక తప్పదు. వాణిశ్రీ స్టైల్స్ చూసి, కొందరు హిందీ నటి ముంతాజ్ కాపీ అని ఎద్దేవా చేశారు. కానీ, తెలుగునాట వాణిశ్రీ శారీస్, వాణిశ్రీ బ్లౌజులు, వాణిశ్రీ కర్చీఫ్ లు అంటూ ఆమె పేరు మీద అమ్మకాలు సాగాయి. ఆ రోజుల్లో అమ్మాయిలు అచ్చు వాణిశ్రీలాగా ముస్తాబు కావాలని తపించేవారు. కలర్ మూవీస్ లో వాణిశ్రీ ధరించిన చీరలు చూసి, అచ్చు అలాంటివి కట్టుకొని ఎంతోమంది అమ్మాయిలు మురిసిపోయేవారు. ముఖ్యంగా 70లలో వాణిశ్రీ సినిమాల్లో ధరించిన చీరల్లాంటివి సొంతం చేసుకోవడం నాటి వనితలకు బంగారం కొన్నదాని కంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది. ఇంతలా అలరించిన నాయిక మళ్ళీ కానరాలేదంటే అనతిశయోక్తి!
ఒక్కో మెట్టూ ఎక్కుతూ…
నెల్లూరుకు చెందిన వాణిశ్రీ బాల్యం నుంచీ కన్నాంబ, సావిత్రి వంటి మేటి నటీమణుల చిత్రాలు చూసి వారిలాగే నటిస్తూ చుట్టూ ఉన్నవారిని అలరిస్తూండేవారు. ఆమెలోని చలాకీ తనం చూసిన ఇరుగుపొరుగువారు ఆమె సోదరి ప్రోత్సహించారు. కొన్ని నాటకాల్లోనూ నటించారు. తరువాత చెన్నై చేరారు. అవకాశాల కోసం వెదుకులాట ప్రారంభించిన సమయంలో బి.ఏ.సుబ్బారావు తాను తెరకెక్కించిన ‘భీష్మ’ చిత్రంలో గంగాదేవి పాత్రధారికి చెలికత్తెగా నటింప చేశారు. అలా యన్టీఆర్ ‘భీష్మ’ చిత్రంలో వాణిశ్రీ కొన్ని క్షణాలు పాటు తొలిసారి తెరపై కనిపించారు. ఆ తరువాత పలు చిత్రాలలో చెల్లెలు, మరదలు వంటి పాత్రల్లో నటించారు. పద్మనాభం, రాజబాబు, బాలకృష్ణ వంటి హాస్యనటులకు జోడీగానూ కనిపించి మురిపించారు. ‘మంగమ్మ శపథం’లో ఓ వరైటీ నడకతో ప్రేక్షకులకు ఇట్టే గుర్తుండిపోయారు. ‘పాండవవనవాసము’లో సత్యభామగా కనిపించారు. ‘శ్రీకృష్ణతులాభారం’లో సత్యభామ చెలికత్తెగా అలరించారు. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో చంద్రమోహన్ సరసన నాయికగా నటించారు. ‘పిడుగురాముడు’, ‘గోపాలుడు-భూపాలుడు’ ‘కంచుకోట’ వంటి చిత్రాలలో పద్మనాభం సరసన చిందేసి కనువిందు చేశారు. ‘ఉమ్మడి కుటుంబం, నిండు మనసులు’ చిత్రాల్లో రాజబాబుతో జోడీ కట్టారు. ‘అగ్గిబరాటా’లో బాలకృష్ణతో నవ్వులు పూయించారు.
హాస్యనటిగా రాణిస్తూనే కొన్ని చిత్రాలలో నాయికగానూ నటించారు వాణిశ్రీ. ‘మరపురాని కథ’ చిత్రం నటిగా వాణిశ్రీకి మంచిమార్కులు సంపాదించి పెట్టింది. “లక్ష్మీనివాసం, సుఖదుఃఖాలు, రణభేరి, మహాబలుడు, జగత్ కిలాడీలు”వంటి చిత్రాలలో నాయికగా నటించిన వాణిశ్రీ ఒక్కోచిత్రంతో నటిగా మార్కులు పోగేసుకుంటూసాగారు. అదే ఆమెను ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుని సరసన ‘ఆత్మీయులు’లో నటింప చేసింది. ఆ సినిమా కాగానే మరో అగ్రనటుడు యన్టీఆర్ సరసన ‘నిండు హృదయాలు’లో జోడీ కట్టి అలరించారు వాణిశ్రీ. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో అప్పటి దాకా సెకండ్ గ్రేడ్ హీరోల సరసన నటించిన వాణిశ్రీకి మేటి నటులతో జోడీ కట్టే ఛాన్స్ చిక్కింది. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘బంగారు పంజరం’ అంతగా అలరించకపోయినా, వాణిశ్రీకి నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. సావిత్రి అంతటి మహానటి “నా తరువాత నా వారసురాలివి నువ్వే…” అంటూ ఆమెను ఆశీర్వదించారు. యన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’లో సావిత్రి కోడలు పాత్ర పోషించగా, రామారావు జోడీగా వాణిశ్రీ నటించారు. ఆ సినిమా ఘనవిజయంతో యన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో వరుసగా అవకాశాలు సంపాదించారు వాణిశ్రీ. ఓ వైపు ఈ ఇద్దరు అగ్రనటుల చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, రామకృష్ణ వంటివారి సినిమాల్లోనూ నాయికగా అలరించారు వాణిశ్రీ.
ఏయన్నార్ హిట్ పెయిర్…
ఏయన్నార్ నవలానాయకునిగా తెలుగు చిత్రసీమలో అలరిస్తే, నవలానాయికగా వాణిశ్రీ మురిపించారు. ‘ఆత్మీయులు, ప్రేమనగర్, జీవనతరంగాలు, విచిత్రబంధం, సెక్రటరీ, చక్రవాకం, జీవనజ్యోతి’ వంటి నవలా చిత్రాల్లో వాణిశ్రీ అందం, అభినయం జనాన్ని ఆకట్టుకున్నాయి. ఇక ఏయన్నార్ తొలి స్వర్ణోత్సవ చిత్రం ‘దసరాబుల్లోడు’లో వాణిశ్రీ చిందేసిన తీరు, కన్నీరు పెట్టించిన వైనం జనాన్ని కట్టిపడేశాయి. వారిద్దరూ జంటగా నటించిన “ప్రేమనగర్, కొడుకు-కోడలు, దత్త పుత్రుడు, విచిత్రబంధం, బంగారుబాబు, మంచివాడు, పవిత్రబంధం” వంటి సినిమాలు మురిపించాయి. ఏయన్నార్ అనారోగ్యం కారణంగా ఓ యేడాది నటించలేదు. తరువాత ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘సెక్రటరీ’లో్నూ వాణిశ్రీ నాయిక కావడం విశేషం. ఆ తరువాత వారిద్దరూ “ఆలుమగలు, చక్రధారి, చిలిపికృష్ణుడు, దేవదాసు మళ్ళీ పుట్టాడు, శ్రీరామరక్ష” మొదలైన చిత్రాల్లో నటించి అభిమానులకు ఆనందం పంచారు.
తిరుగులేని నాయిక…
యన్టీఆర్ ‘భీష్మ’తోనే చిత్రసీమలో అడుగు పెట్టిన వాణిశ్రీ ఆయనతో కలసి “నిండు హృదయాలు, జీవితచక్రం, రైతుబిడ్డ, అదృష్టజాతకుడు, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, దేశోద్ధారకులు, మనుషుల్లో దేవుడు, ఎదురులేని మనిషి, రాముని మించిన రాముడు, మాయామశ్చీంద్ర, ఆరాధన, ఎదురీత, సింహబలుడు, మావారి మంచితనం, శ్రీమద్విరాటపర్వము” వంటి చిత్రాలలో జంటగా కనిపించి జనానికి కనువిందు చేశారు. ఇక కృష్ణతో “మహాబలుడు, జగత్ కిలాడీలు, పచ్చని సంసారం, అత్తలూ-కోడళ్ళు, ఇల్లు-ఇల్లాలు, శ్రీవారు -మావారు, అమ్మాయిగారు అబ్బాయిగారు, గంగ-మంగ, చీకటివెలుగులు, జన్మజన్మలబంధం” తదితర చిత్రాలలో వాణిశ్రీ నటించి మెప్పించారు. శోభన్ బాబుతో “కథానాయకురాలు, జగత్ జెంత్రీలు, దెబ్బకు ఠా దొంగలముఠా, అమ్మమాట, గంగ-మంగ, మైనర్ బాబు, చెల్లెలి కాపురం, కన్నవారి కలలు, జీవనజ్యోతి, బాబు, ప్రేమబంధం, పొగరుబోతు, దేవుడు మావయ్య” మొదలైన సినిమాల్లో నటించి అలరించారు వాణిశ్రీ. ఇక కృష్ణంరాజును హీరోగా నిలిపిన “కృష్ణవేణి, భక్తకన్నప్ప” చిత్రాలలో వాణిశ్రీ నాయికగా నటించారు. రామకృష్ణతో “పూజ, దొరలు-దొంగలు” వంటి చిత్రాల్లో అభినయించారు. ఇలా నాటి మేటి నటులతో నటించిన వాణిశ్రీ కాల్ షీట్స్ కోసం ఆ రోజుల్లో ఎందరో నిర్మాతలు పడిగాపులు కాచేవారు. వాణిశ్రీ కాల్ షీట్స్ దొరికిన నిర్మాతను ఆ రోజుల్లో అదృష్టవంతునిగా భావించేవారు.
తరువాతి రోజుల్లో…
సూపర్ హీరోయిన్ గా సాగిన వాణిశ్రీ తన స్టార్ డమ్ మసకబారిందని తెలియగానే గౌరవంగా వివాహం చేసుకొని తప్పుకున్నారు. ఒకప్పుడు కాంతారావు చిత్రాల్లో ఆయన సరసన నటించిన వాణిశ్రీ, ఆయన పరిస్థితి బాగోలేదని తెలిసి కాల్ షీట్స్ ఇచ్చారు. అలా కాంతారావు నిర్మించిన ‘స్వాతిచినుకులు’ చిత్రంలో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు వాణిశ్రీ. ఈ సినిమా కంటే ముందు చిరంజీవికి అత్తగా వాణిశ్రీ నటించిన ‘అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు’ విడుదలై విజయం సాధించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, సుమన్, వినోద్ కుమార్ వంటి వారి చిత్రాల్లో వాణిశ్రీ తనకు లభించిన పాత్రలు పోషించి మెప్పించారు.
తరువాతి రోజుల్లో వాణిశ్రీ నటించిన చిత్రాలలో “ప్రాణానికి ప్రాణం, అల్లరి అల్లుడు, బొబ్బిలిరాజా, పెద్దింటి అల్లుడు, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, బొంబాయి ప్రియుడు, జాబిలమ్మ పెళ్ళి, కోరుకున్న ప్రియుడు, భద్రాద్రి రాముడు” వంటివి ఉన్నాయి.
మాతృభాష తెలుగులోనే కాదు తమిళ, కన్నడ చిత్రాల్లోనూ వాణిశ్రీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. వాణిశ్రీ పేరు వింటే చాలు ఈ నాటికీ ఆ నాటి అభిమానుల హృదయాలు ఆనందంతో నిండిపోతాయి.