Mansoor Ali Khan is this correct to target Chiranjeevi: దొంగే దొంగని అరిచినట్టు అనిపిస్తోంది తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ మాటలు. ఈయన తెలుగు వారికి బాగానే తెలుసు, ఆయన పేరేంటి అని తెలియక పోయి ఉండచ్చు కానీ 90లలో అనేక సినిమాల్లో ఆయన కనిపించాడు. మన తెలుగు సినిమాల్లో అనేక మంది హీరోలతో తన్నులు తిన్న ఆయన ఇప్పుడైతే పూర్తిగా తమిళ సినీ పరిశ్రమకే పరిమితం అయిపోయాడు. ఆ మధ్య ఎన్నికల్లో పోటీ చేసి రకరకాల విన్యాసాలు చేసి వార్తలకు ఎక్కినట్టు కూడా గుర్తు. ఆ తరువాత ఏమైపోయాడని కూడా ఎవరికీ గుర్తు లేదు. అలాంటి ఆయనకు తమిళంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కింది. విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన లియో సినిమాలో లియో గురించి తెలిసిన ఏకైక సన్నిహితుడిగా నటించాడు మన్సూర్ అలీ ఖాన్. ఈ సినిమా సక్సెస్ అయిందా లేదా అనే మాట పక్కన పెడితే సినిమాలో నటించిన నటీనటులు అందరిని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని వెలుగులోకి వచ్చింది.
నిజానికి ఈ విషయం మీద త్రిష ట్వీట్ చేసేవరకు తెలుగు మీడియాకి అసలు ఏమి జరిగిందో తెలియదు. త్రిష మన్సూర్ అలీ ఖాన్ గురించి ట్వీట్ చేసిన తరువాత అసలు ఆయన ఏమన్నాడు అని వెతికే పనిలో ఉండగా తమిళ మీడియా, నేషనల్ మీడియా నివేదికలను బట్టి మన్సూర్ అలీ ఖాన్ చేసిన నోటి దురద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. నిజానికి మన్సూర్ అలీ ఖాన్ చెబుతున్న దాని ప్రకారం తాను అన్న మాటలు తప్పే కాదట. నిజానికి ఆయన త్రిషను రేప్ చేసే బెడ్ రూమ్ సీన్ ఉండేది అనుకున్నా కానీ నాకు ఆమెను చూపించనే లేదని కామెంట్ చేశారు. అది నచ్చక త్రిష అతని మీద ఫైర్ అయి ఇప్పటివరకు నటించనందుకు హ్యాపీ ఇక మీదట నటించకుండా జాగ్రత్త పడతా అని చెప్పడంతో ఏ సినిమాలో నటన గురించి మన్సూర్ వ్యాఖ్యానించాడో ఆ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సైతం అతని వ్యాఖ్యల్ని తప్పుపట్టాడు. ఈ క్రమంలో చాలా మంది తమిళ నటీనటులు, దర్శకులు తెలుగు నటీనటులతో పాటు నటి ఖుష్బు, మెగాస్టార్ చిరంజీవి స్పందించి మన్సూర్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. అయితే మిగతా అందరిన్నీ వదిలేశాడు కానీ మన్సూర్ త్రిష, కుష్బూ, చిరంజీవి మీద పడ్డాడు.
ముఖ్యంగా చిరంజీవి నన్ను తప్పు పడుతూ ట్వీట్ వేశారు, ఆయన పెద్ద నటుడు, పొలిటికల్ పార్టీ కూడా నడిపిన వారు, నేను ఆయనతో కలిసి పనిచేశా, అలాంటి వ్యక్తి.. ట్వీట్ వేసేముందు.. ఒక్కసారి నాకు కాల్ చేసి అడగాల్సింది. మన్సూర్ గారు.. అసలు జరిగింది ఏంటి.. ? ఇలా ట్వీట్ వేస్తున్నా.. ? నిజానిజాలు తెలుసుకుని వేయాల్సింది. నాది వక్రబుద్ధి అని ఆయన చెబుతున్నారు.. మరి ఆయనది ఏంటి.. ? రాజకీయాల పేరుతో ఎంతోమంది దగ్గర డబ్బు తీసుకొని ప్రజలకు ఏం చేయకుండా ఆయనే వాడుకున్నారు. అవన్నీ నేను అడగాలా.. ? అందుకే నేను వారి మీద పరువు నష్టం కేసు వేస్తున్నా.. త్రిష పది కోట్లు.. ఖుష్బూ పదికోట్లు.. చిరంజీవి.. 20 కోట్లు ఇవ్వాలి. వారు ఇచ్చిన డబ్బును.. నేను తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తా అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఒక సహ నటుడు తన సహ నటిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఇది తప్పు అని ఖండించకూడదా ? ఏం ఇదే విషయం మీద జాతీయ మహిళా కమిషన్ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఏమైంది ఈ పౌరుషం, పరువు నష్టం. నటుడిగా తెలుగు వారిలో మరెవరికీ సాధ్యం కాని స్థాయిలో తిరుగులేని ఆదరణ ఉన్న హీరోపై ఇలాంటి మాటలా మాట్లాడేది. చిరంజీవి చేసిన సాయం తెలుగు వారికే కాదు వరదల సమయంలో సాయం అందుకున్న మీ తమిళ తంబీలను అడుగు చెబుతారు. ప్రాణాల మీదకు వస్తే మీరెవరూ పట్టించుకోని మీ తోటి విలన్ పొన్నాంబళంను అడుగు చెబుతాడు చిరంజీవి ఎలాంటి వాడో. అలాంటి వ్యక్తి నేనేమన్నా సైలెంట్ గా ఉంటున్నాడు అనుకుంటే అది పొరబాటే. ఆయన ఒక మహిళపై మాట్లాడిన మాటలను ఖండించాడు అదే పాపం అన్నట్టు దొంగే దొంగ అన్నట్టు మీ ప్రవర్తన మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు.