(అక్టోబర్ 21న షమ్మీకపూర్ జయంతి)
హిందీ సినిమా రంగంలో డాన్సింగ్ హీరోగా షమ్మీ కపూర్ పేరొందారు. ఆయన కంటే ముందు కొందరు నటులు డాన్సులు చేసినా, అవి ఒకటి, అరా ఉండేవి. కానీ, షమ్మీ కపూర్ మాత్రం తన పాటలకు తానే డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నటించి, ‘డాన్సింగ్ హీరో’గానూ, ‘ఎల్విస్ ప్రిస్లీ ఆఫ్ ఇండియా’గానూ పేరొందారు. షమ్మీ ప్రతి చిత్రంలో ఏదో ఒక పాటలో ఆయన స్టైల్ ఆఫ్ డాన్సింగ్ కనువిందు చేసేది. అన్న రాజ్ కపూర్, తమ్ముడు రిషి కపూర్ కు భిన్నంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు షమ్మీకపూర్. భారీ కాయంతోనూ షమ్మీ చేసిన మ్యాజిక్ ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు.
మహానటుడు పృథ్వీరాజ్ కపూర్ రెండో తనయునిగా షమ్మీ కపూర్ 1931 అక్టోబర్ 21న జన్మించారు. ఆయన పూర్తి పేరు షంషేర్ రాజ్ కపూర్. షమ్మీ అన్నది ముద్దు పేరు. స్టేజ్ పైనా, సినిమాల్లోనూ ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందారు షమ్మీ కపూర్. ఆయన పుట్టింది బొంబాయిలోనే అయినా, బాల్యంలో ఎక్కువ భాగం కలకత్తాలో గడిపారు. పృథ్వీరాజ్ కపూర్ రంగస్థలంపైనా, సినిమాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఆయనకు సినిమాలకంటే రంగస్థలంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. దాంతో కలకత్తాలోనూ ఓ డ్రామా కంపెనీ ఆరంభించారు. అక్కడే ఉంటూ నటించవలసి వచ్చింది. అందువల్ల షమ్మీ బాల్యం కలకత్తాలో సాగింది. మెట్రిక్యులేషన్ దాకా చదివిన షమ్మీ కపూర్ బొంబాయిలోని రామ్ నారాయణ్ రుయా కాలేజ్ లో చేరి, డిగ్రీ పూర్తి కాకుండానే వదిలేశారు. తరువాత తండ్రి నడుపుతున్న పృథ్వీ థియేటర్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా సాగారు. అప్పట్లో ఆయనకు నెలకు ముప్పై రూపాయలు జీతం ఇచ్చేవారు. అలా నెలకు మూడు వందల యాభై రూపాయలు సంపాదించేదాకా తండ్రి నిర్వహిస్తోన్న పృథ్వీ థియేటర్స్ లోనే నటునిగా కొనసాగారు షమ్మీ. 1953లో రూపొందిన ‘జీవన్ జ్యోతి’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు షమ్మీ కపూర్. అయితే వచ్చీ రాగానే విజయాలేమీ ఆయనను వరించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కునిలా చిత్రసీమలోనే తాడో పేడో తేల్చుకోవాలని సాగారు. దాదాపు నాలుగేళ్ళు పరాజయాలే షమ్మీని పలకరించాయి. 1957లో నాజిర్ హుసేన్ తెరకెక్కించిన ‘తుమ్సా నహీ దేఖా’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత నుంచీ షమ్మీ కపూర్ విజయయాత్ర కొనసాగింది.
షమ్మీ కపూర్ నటించిన “దిల్ దేఖే దేఖో, జంగ్లీ, కాలేజ్ గర్ల్, బసంత్, సింగపూర్, బాయ్ ఫ్రెండ్, రాజ్ కుమార్, ప్రొఫెసర్, దిల్ తేరా దీవానా, వల్లా క్యా బాత్ హై, ప్యార్ కియాతో డర్నా క్యా, చీనా టౌన్, కశ్మీర్ కీ కలీ, బ్లఫ్ మాస్టర్, జాన్వర్, తీస్రీ మంజిల్, బ్రహ్మచారి” చిత్రాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. “అందాజ్, ఛోటే సర్కార్” చిత్రాలలో హీరోగా నటించి, విజయాలు చూసినా, వాటిలో నటించిన హీరోయిన్స్ కే క్రెడిట్ దక్కింది. అప్పటికే షమ్మీ కపూర్ బాగా లావు అయిపోయారు. ఈ నేపథ్యంలో తన సరసన నటించిన నాయికలకే ఆయన తండ్రి పాత్రలు ధరించడం ఆరంభించారు. దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్ తో కలసి ‘విధాత’లో నటించి మెప్పించారు షమ్మీ. జాకీ ష్రాఫ్ హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘హీరో’లో నాయికకు తండ్రిగా నటించి ఆకట్టుకున్నారు. ఒకప్పుడు రాక్ డాన్సర్ గా పేరొందిన షమ్మీ కపూర్, తరువాతి రోజుల్లో గోవిందా హీరోగా రూపొందిన ‘రాక్ డాన్సర్’లోనూ, తన అన్న మనవడు రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘రాక్ స్టార్’లోనూ నటించడం విశేషం. ఆయన నటించిన చివరి చిత్రం ‘రాక్ స్టార్’. ఆయన మరణానంతరం విడుదలయింది.
బుల్లితెరపై ‘బైబిల్ కీ కహానియా’లో నిమ్రోద్ పాత్రలో నటించారు షమ్మీ కపూర్. నటి గీతా బాలిని వివాహమాడారు షమ్మీ కపూర్. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆదిత్య రాజ్ కపూర్, కూతురు కాంచన్. గీతా బాలి మరణం తరువాత నీలా దేవిని పెళ్ళాడారు షమ్మీ కపూర్. ఆయన తనయుడు ఆదిత్య రాజ్ కపూర్ కూడా తండ్రి బాటలో పయనిస్తూ కొన్ని చిత్రాలలో నటించాడు. షమ్మీ కపూర్ దర్శకత్వంలో ‘మనోరంజన్’, ‘బందల్ బాజ్’ చిత్రాలు రూపొందాయి. ఇవి అంతగా అలరించక పోయినా, తరువాతి రోజుల్లో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదిత్య రాజ్ కపూర్ సైతం “డోంట్ స్టాప్ డ్రీమింగ్, సంబార్ సల్సా” చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మరి కొద్ది రోజులకు 80 ఏళ్ళు పూర్తవుతాయి అనగా షమ్మీ కపూర్ 2011 ఆగస్టు 14న కన్నుమూశారు. ఈ నాటికీ అభిమానుల మదిలో ‘రియల్ రాక్ స్టార్’గానే నిలచి ఉన్నారు షమ్మీ కపూర్.