Aishwarya Rai: నీటి బిందువులు సముద్రాన్ని నింపుతాయని అంటారు. ప్రతి చిన్న ఆరంభానికి ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుందనే దానికి నిలువెత్తు ఉదాహరణ ఐశ్వర్య రాయ్. నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్ అయినప్పటికీ, ఆమె కెరీర్ ఆరంభం మాత్రం చాలా సాధారణం.. తన కెరీర్ కూడా అంతా సులువుగా సాగింది ఏమీ లేదు.. వినోద రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఐశ్వర్య రాయ్ తన మొదటి మూడు వాణిజ్య ప్రకటనల ద్వారా కేవలం రూ.5 వేల రూపాయలు మాత్రమే సంపాదించింది. గ్లామర్, అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపుకు ముందే ఆమె ప్రయాణం ఇలా చిన్న అడుగులతో మొదలైంది.
Read Also: IND vs NZ: నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20.. సొంతగడ్డపై సంజు శాంసన్‌కు ఛాన్స్?
నిర్మాత శైలేంద్ర సింగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య.. తన కెరీర్ తొలి రోజులను గుర్తుచేసుకున్నారు. ఐశ్వర్య అప్పటికి 18 లేదా 19 ఏళ్ల వయసు ఉంటుంది. మెరైన్ డ్రైవ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి రాత్రి 8:30 సమయంలో మమ్మల్ని కలవడానికి వచ్చింది. ఆమె మా మొదటి మూడు ప్రకటనలను కేవలం ఐదు వేల రూపాయలకే చేసింది అని ఆయన తెలిపారు. అయితే, ఆమె చేసిన మొదటి వాణిజ్య ప్రకటన ముకేష్ మిల్స్‌లో చిత్రీకరించారని, అందులో ఆమెను ఒక స్తంభానికి కట్టిన సీన్ ఉందని శైలేంద్ర సింగ్ వివరించారు. ఆ తర్వాత మాళవిక తివారీతో కలిసి కలబంద హెయిర్ ఆయిల్ ప్రకటన, అర్జున్ రాంపాల్‌తో మరో యాడ్ చేసింది. ఈ వినయపూర్వకమైన ఆరంభమే ఆమె అద్భుతమైన కెరీర్‌కు పునాది వేసింది.
1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, నటనలోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. “హమ్ దిల్ దే చుకే సనమ్”, “దేవదాస్”, “తాల్”, “గురు”, “జోధా అక్బర్”, “ఏ దిల్ హై ముష్కిల్” వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానం సంపాదించింది. మణిరత్నం, సంజయ్ లీలా భన్సాలీ, రితుపర్ణో ఘోష్ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేసి ప్రేమ, భావోద్వేగం, నృత్యం అన్నింటిలోనూ తన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేసింది.
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన “హమ్ దిల్ దే చుకే సనమ్”, “దేవదాస్” చిత్రాలకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డులు కూడా లభించాయి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్, పారిస్ ఫ్యాషన్ వీక్ వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. ఇక, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఐశ్వర్య చాలా నిరాడంబరంగా ఉంటుందని, ఆమె వ్యక్తిత్వం పరిశ్రమకు ఆదర్శంగా నిలుస్తుందని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఎంతటి స్టార్డమ్ ఉన్నా, ఆమె తన జీవితాన్ని సమతూకంతో, గౌరవంతో ముందుకు తీసుకెళ్తుందన్నారు. మొత్తంగా.. రూ.5 వేలతో మొదలైన ప్రయాణం నేడు కోట్లకు చేరడం వెనుక ఐశ్వర్య రాయ్ కష్టం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆమె జీవితం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.