2020 మొదట్లో షాకిచ్చిన కరోనా వైరస్ క్రమంగా పక్కకు తప్పుకుంటోందా? చాలా దేశాల్లో అలాంటి స్థితి లేకున్నా అమెరికాలో అంతా నార్మల్ అవుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా, ప్రతీ వారం నడిచే వీకెండ్ బాక్సాఫీస్ ఫైట్స్ రాను రాను రక్తి కడుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ నీరసంగా రిలీజైన చిత్రాలు ఇప్పుడు కలెక్షన్లతో కళకళలాడుతున్నాయి. అంతే కాదు, లెటెస్ట్ గా రిలీజైన ‘స్పేస్ జామ్’ మైండ్ జామైపోయేలా వసూళ్లతో ఆశ్చర్యపరిచింది! గత వారం కంటే అంతకు ముందటి వారం జనం ముందుకొచ్చింది ‘బ్లాక్ విడో’ సినిమా. స్కార్లెట్ జోహాన్సన్ లాంటి పెద్ద స్టార్ ఉండటం, పైగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని సూపర్ హీరో సినిమా కావటం మంచి హైప్ తీసుకొచ్చింది. అయితే, థియేటర్స్ లో విడుదలైన వెంటనే మంచి దుమారం రేపింది యాక్షన్ థ్రిల్లర్. మొదటి వారం రికార్డులు బద్ధలు కొట్టింది. ప్యాండమిక్ టైంలో బాక్సాఫీస్ వద్దకొచ్చిన సినిమాలన్నిట్లో ‘బ్లాక్ విడో’దే టాప్ పొజీషన్ అన్నారు. అయితే, ఇదంతా ఒక్క వారంలోనే తిరగబడిపోయింది. లెటెస్ట్ వీకెండ్ లో ‘స్పేస్ జామ్’ మూవీ ‘బ్లాక్ విడో’కు షాకిచ్చింది!
‘స్పేస్ జామ్’ సినిమా రివ్యూలు కూడా సరిగ్గా దక్కకపోవటంతో అంతంతమాత్రమే అనుకున్నారు. అమెరికాలో 20మిలియన్ డాలర్స్ మార్కు దాటితే అదే చాలని నిర్మాతలు భావించారు. కానీ, 31.7 మిలియన్ డాలర్స్ ఖాతాలో వేసుకుని ఎవరూ ఊహించని ఫీట్ చేసింది ‘స్పేస్ జామ్’. దీనికి కారణం, అదొక ఫ్యామిలి మూవీ కావటమే అంటున్నారు చాలా మంది. యూఎస్ లో చిన్నా, పెద్దా అంత ‘స్పేస్ జామ్’ కోసం ఇళ్లలోంచి కదిలారట! హెబీఓ మ్యాక్స్ ఓటీటీలో ఆ సినిమా ఫ్రీగా అందుబాటులో ఉన్నా థియేటర్స్ కి వచ్చి టికెట్ కొని చూశారట! ఎవరూ ఊహించని ‘స్పేస్ జామ్’ దాదాపు 32 మిలియన్ డాలర్స్ కొల్లగొడితే రెండో వీకెండ్ లో ‘బ్లాక్ విడో’ కేవలం 26.3 మిలియన్ డాలర్స్ తో సరిపెట్టుకుంది. ఇది దాదాపు 67 శాతం తక్కువ! అంత వేగంగా ‘బ్లాక్ విడో’ వసూళ్లు పడిపోవటం కొంత ఆశ్చర్యమే! అయితే, అమెరికాలో ఇప్పుడు ప్రేక్షకుల మూడ్ మాత్రం క్లీన్ అండ్ కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పై ఉందని మాత్రం ‘స్పేస్ జామ్’ నిరూపించింది!