ఆగస్ట్ 23 ను హ్యాష్ డే గా ట్విట్టర్ నిర్వహిస్తోంది. 2007 ఆగస్ట్ 23న మొదటి సారి హ్యాష్ ట్యాగ్ ను వాడుకలోకి తీసుకొచ్చింది ట్విట్టర్. అప్పటి నుండీ హ్యాష్ ట్యాగ్ తో తమకు కావాల్సిన సమాచారాన్ని తేలికగా అందిపుచ్చుకోవడానికి అవకాశం చిక్కినట్టయ్యింది. విశేషం ఏమంటే… ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ సరికొత్త రికార్డులకు నెలవైంది. ఏ హీరో బర్త్ డే జరిగినా… ఏదైనా ఈవెంట్ జరిగినా ఆ పేరుతో క్రియేట్ చేసిన హ్యాష్ ట్యాగ్ ను ఎంత మంది వినియోగించారనే లెక్కలు మొదలయ్యాయి. తాజాగా హ్యాష్ ట్యాగ్ డే సందర్బంగా ట్విట్టర్ ఈ యేడాది జనవరి 1 నుండి జూన్ 30 తొలి ఆరు నెలల కాలంలో అత్యధికంగా ట్వీట్ చేసిన హ్యాష్ ట్యాగ్స్ జాబితాను వెల్లడించింది. తొలి పది పేర్లలో సౌతిండియన్ మూవీస్, స్టార్స్ ఉండటం విశేషం. అయితే… టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులను కోలీవుడ్ హీరోలు అజిత్, విజయ్ డామినేట్ చేసేశారు. అంతేకాదు… మొదటి రెండు స్థానాలలో వారిద్దరి చిత్రాలే నిలవడం విశేషం.
Read Also: ‘తలైవి’ వచ్చేది ఎప్పుడంటే…
అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వాలిమై’ హ్యాష్ ట్యాగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత పొంగల్ సీజన్ లో వచ్చిన విజయ్ ‘మాస్టర్’ మూవీ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మూడో స్థానంలో వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీ నిలవడం విశేషం. ఇక నాలుగు, ఐదు స్థానాలలో అజిత్ కుమార్, దళపతి65 హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆరవ స్థానాన్ని దిహార్ట్ అవార్డ్స్, ఏడో స్థానాన్ని బిగ్ బాస్ 14 సీజన్ విజేత రుబినా దిలైక్ పొందారు. ఎనిమిదో స్థానంలో బిటీఎస్ నిలువగా, తొమ్మిదవ స్థానంలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన కొవిడ్19 దక్కించుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది. మొత్తం మీద హ్యాష్ ట్యాగ్స్ ను ఉపయోగించడంలో మనోళ్లే తోపు అనేది అర్థమైపోతోంది.
