Sonu Sood: కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ‘మెస్సీయ’గా ఉండటంతో పాటు అనంతరం పేదలకు వైద్యం, విద్య, ఉపాధి రంగాలలో ఎంతో సాయం చేశారు సోనూసూద్. తన మిత్రుల సాయంతో సూద్ ఛారిటీ ఫౌండేషన్‌ను స్థాపించి పరోపకారం చేస్తూ ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి ఆదివారం రాత్రి ముంబైలోని తాజ్ శాంతాక్రూజ్‌లో సొసైటీ అచీవర్స్ అవార్డ్స్‌లో ‘నేషన్స్ ప్రైడ్’గా సోనూసూద్ ను సత్కరించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ అవార్డును సోనూసూద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం పాల్గొని, సోనూసూద్ ను అభినందించారు.
సత్కారానంతరం సోనూసూద్ మాట్లాడుతూ, “ఆరోగ్యకరమైన, ఉత్పాదక జీవితాన్ని గడపడానికి అవసరమైన సాధనాలతో వెనుకబడిన వారి జీవితాలను మార్చడం నా లక్ష్యం. ఈ రోజు సూద్ ఛారిటీ ఫౌండేషన్స్ ప్రయత్నాలకు గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల విజయగాథలను గౌరవించే, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హేమమాలిని, తమన్నా భాటియా, మధుర్ భండార్కర్, ఫరా ఖాన్ తదితరులు హాజరయ్యారు.
