సర్వవిజ్ఞాలు తొలగించి, జయం చేకూరాలని భారతీయుల్లో అత్యధికులు వినాయకునికే తొలి పూజలు చేస్తారు. ఇది యుగయుగాలుగా వస్తున్న ఆచారం. ఆబాలగోపాలానికీ విఘ్నేశ్వరుడంటే ఎంతో భక్తిప్రపత్తులు! అందువల్ల గణేశ చతుర్థిని అందరూ ఆనందంగా జరుపుకోవడం అడుగడుగునా కనిపిస్తుంది. ఎల్లలు దాటి సైతం వినాయక చవితి ఉత్సవాలు సాగుతూ ఉంటాయి. అంతటి ప్రశస్తమైన పర్వదినాన్ని జనం మదిలో నిలుపుతూ, ‘వినాయక చవితి’ చిత్రాన్ని రూపొందించారు ప్రసిద్ధ రచయిత సముద్రాల రాఘవాచార్య. ఇందులో శ్రీకృష్ణ పాత్రలో యన్.టి.రామారావు నటించారు. ఈ చిత్రం 1957 ఆగస్టు 22న వినాయక చవితి రోజునే విడుదలై విజయఢంకా మోగించింది.
ప్రతి ‘వినాయక చవితి’న వినాయక వ్రతకథ చదువుకొని పూజ చేసుకోవడం ఆనవాయితీ. ఆ కథను ఆధారం చేసుకొనే జనానికి ఇట్టే అర్థమయ్యేలా సముద్రాల రాఘవాచార్య ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం! ఈ నాటికీ దేవాలయాల్లోనూ, కొన్ని సినిమా థియేటర్లలోనూ, ఉత్సవాల్లోనూ తొలిగా వినిపించే “శుక్లాంబరధరం విష్ణుం…” అంటూ సాగే శ్లోకం, తరువాత వినిపించే “వాతాపి గణపతింభజే…” గీతం- ఈ ‘వినాయక చవితి’ చిత్రం లోనివే. ఘంటసాల గానంతో ఆ శ్లోకం, గీతం ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం!
ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే – జగద్వితమైన గాథే! పార్వతీదేవి పరమేశుని రాకను ధ్యానిస్తూ, సున్నిపిండితో ఓ బొమ్మను చేసి ప్రాణం పోయడం, ఆ బాబును కాపలాగా ఉంచి ఆమె స్నానానికి వెళ్ళడం, వచ్చిన పశుపతిని ఆ పసివాడు అడ్డగించడం, బాలుని తల శివుని శూలం వేటుకు తెగిపడడం జరుగుతాయి. పార్వతి ఆవేదన చూసిన పరమేశ్వరుడు కింకరులను ఉత్తరదిశగా నిదురించే ఏ జీవి తలనైనా తీసుకురండి అని చెబుతాడు. అలా బాలుడు గజాననుడై పునర్జీవితుడవుతాడు. కైలాసంలో సాగే ఆటపాటలకు పరవశుడై వినాయకుడు నాట్యం చేయగా, చంద్రుడు ఆయనను చూసి నవ్వడం, అందుకు వినాయకుడు శాపమొసగడం, అందరూ వేడుకొనగా చంద్రునికి శావవిముక్తి కలిగించడం, వినాయక చవితిన గణేశుని పూజించడమే అన్నిటికీ నివారణ అని తెలపడంతో కథ మొదలవుతుంది. తదుపరి ద్వారకలో శ్రీకృష్ణుడు పాలలో నింగిలోని చంద్రుని చూడడం, నీలాపనిందలకు గురికావడం జరుగుతాయి. సత్రాజిత్తు సంపాదించిన శమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న అపవాదు వస్తుంది. శ్రీకృష్ణుడు వెళ్ళి జాంబవంతునితో పోరాడి, మణిని, కన్యామణి జాంబవతిని పొందడం, ఆ పై సత్రాజిత్తు కూడా తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతాయి. తనకు మాట ఇచ్చి, కృష్ణునికి సత్యభామను ఇచ్చి పెళ్ళి చేస్తాడా అన్న కోపంతో శతధన్వుడు వచ్చి సత్రాజిత్తును సంహరిస్తాడు. శమంతకమణిని శతధన్వుడు ఎత్తుకుపోతాడు. దారి మధ్యలో అక్రూరునికి మణిని ఇస్తాడు. తరువాత శ్రీకృష్ణుని చక్రాయుధానికి బలిఅవుతాడు శతధన్వుడు. అక్రూరుడు వచ్చి, మణిని శ్రీకృష్ణునకు అప్పచెబుతాడు. ఇన్ని అనర్థాలకు చవితి చంద్రుని చూడడమే కారణమని శ్రీకృష్ణుడు అంటాడు. ఈ కథను వినాయక చవితి రోజున ఓ పంతులు పిన్నలకు పెద్దలకు చెప్పడంతో చిత్రం ఆరంభమై, ముగుస్తుంది.
అశ్వరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. గోపాలరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రుక్మిణిగా కృష్ణకుమారి, సత్యభామగా జమున, సత్రాజిత్తుగా గుమ్మడి నటించారు. రాజనాల, ఆర్. నాగేశ్వరరావు, ఎ.ప్రకాశరావు, బొడ్డపాటి, బాలకృష్ణ (అంజి), సూర్యకళ, సత్యాదేవి, బాల ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి పాటలు, మాటలు, దర్శకత్వం సముద్రాల నిర్వహించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. “జయగణ నాయక వినాయకా…”, “దినకరా శుభకరా…”, “శైలసుతా హృదయేశా…”, “హరే నారాయణా…”, “జగదేక రంభయే…”, “కలికీ నే కృష్ణుడనే…”, “కన్నులలో మెరిసే…”, “తనువూగే నా మనసూగే…”, “వేసేను నా మది…”, “యశోదా కిశోరా…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొంది. ఈ నాటికీ వినాయక చవితి రోజున బుల్లితెరపై దర్శనమిస్తూనే ఉందీ చిత్రం.
‘వినాయక చవితి’ చిత్రంతోనే సముద్రాల రాఘవాచార్య దర్శకుడయ్యారు. ‘మాయాబజార్’ తరువాత యన్టీఆర్ శ్రీకృష్ణునిగా నటించిన చిత్రమిది. జమున సత్యభామగా నటించిన తొలి సినిమా ఇదే! ఈ సినిమా తరువాత సముద్రాల సీనియర్ “భక్త రఘునాథ, బభ్రువాహన” చిత్రాలనూ రూపొందించారు. ఈ మూడు చిత్రాలలోనూ యన్టీఆర్ నటించడం విశేషం!