NTV Telugu Site icon

NTR : అరవై ఐదేళ్ళ ‘సంకల్పం’

New Project

New Project

తెలుగునాట టాప్ స్టార్స్ లో నటరత్న యన్.టి.రామారావులాగా పలు విలక్షణమైన పాత్రలు పోషించిన వారు కానరారు. రామారావుకు పాత్రలో వైవిధ్యం కనిపిస్తే చాలు, వెంటనే ఒప్పేసుకొనేవారని ప్రతీతి. అలా ఆయన అంగీకరించిన చిత్రాలలో విలక్షణ పాత్రలు బోలెడున్నాయి. ‘సంకల్పం’ చిత్రంలో యన్టీఆర్ పోషించిన రఘు పాత్ర అలాంటిదే! జల్సాల కోసం దొంగతనాలు చేసే రఘు, చివరకు పెళ్ళాం నగలు ఎత్తుకెళ్ళి మనసు పడ్డ దానికి ఇస్తాడు. ఇలాంటి విలక్షణ పాత్రలో నందమూరి నటన విశేషంగా అలరించింది. ‘సంకల్పం’ చిత్రం 1957 జూన్ 19న ‘సంకల్పం’ చిత్రం విడుదలయింది.

దొంగతనాలు చేసే రఘును చూసి కన్నతల్లి కుమిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా వాడికి పెళ్ళి చేస్తే బాగుపడతాడని ఆశిస్తుంది. తన అన్నయ్య కూతురు లక్ష్మిని ఇచ్చి రఘుకు పెళ్ళి చేయాలని భావిస్తుంది. అందుకు ఆమె అన్న గోపయ్య కూడా అంగీకరిస్తాడు. అయితే గోపయ్య కొడుకు పాపయ్య తన చెల్లెలిని శంకరం అనే ధనవంతునికి ఇచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తాడు. అతని మాట కాదని, రఘు, లక్ష్మి పెళ్ళి జరిగిపోతుంది. తాళి కట్టిన వెంటనే రఘును ఓ దొంగతనం కారణంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలులో రఘుకు గజదొంగ కొండలు పరిచయం అవుతాడు. బయటకు వచ్చాక పలు ప్లానులు వేసి దొంగతనాలు చేయాలని ఆశిస్తారు. కొండలు చెల్లెలు మాయపై రఘు మనసు పారేసుకుంటాడు. భార్య లక్ష్మి నగలు కొట్టేసి మాయకు ఇస్తాడు. తాను పెళ్ళి చేసుకోవాలనుకున్న లక్ష్మి, రఘును మనువాడగానే శంకరం ఆమెను సొంత చెల్లెలిగా చూసుకుంటూ ఉంటాడు. అతని కారణంగానే రఘులో పరివర్తన కలుగుతుంది. దొంగతనాలు మానేసి మంచిగా బతకాలనుకుంటాడు రఘు. అప్పటికే రఘు వల్ల లక్ష్మికి గోపి అనే కొడుకు ఉంటాడు. అతను పెరిగి పెద్దయ్యాక, తన తండ్రి ఓ దొంగ అని తెలుసుకొని ఇంట్లోంచి పారిపోతాడు. గోపి ఓ ఇస్త్రీ పెట్టె ఆమె దగ్గర పనిచేస్తుంటాడు. అతను రోజూ చలువ బట్టలు తీసుకు వెళ్ళి కొండలు చెల్లెలు మాయకు ఇస్తూ ఉంటాడు. ఆమెకు గోపీ అంటే ఎంతో అభిమానం కలుగుతుంది. అప్పటికే ఓ బ్యాంకులో కాపలదారుగా పనిచేస్తుంటాడు రఘు. కొండలు వచ్చి, ఓ భారీ దొంగతనం చేయడానికి రమ్మంటాడు. రానని చెప్పిన రఘు, ఆ దొంగతనం కూడా చేయకుండా చూడాలని భావిస్తాడు. అతడిని పట్టుకొని కొండలు, అతని అనుచరులు కట్టేసి కొడతారు. ఇది చూసిన గోపికి తన తండ్రి మంచివాడు అన్న విషయం తెలుస్తుంది. తల్లితో ఆ మాటే చెబుతాడు. వారిద్దరిని కూడా బంధిస్తారు. చివరకు గోపీ తెలివిగా తప్పించుకొని పోలీసులకు విషయం చేరవేస్తాడు. గోపిని రక్షించబోయి మాయ ప్రాణాలు పోగొట్టుకుంటుంది. చివరకు అందరూ కలుసుకుంటారు. శంకరానికి అతణ్ణి మెచ్చిన సుగుణతో పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.

యన్.టి.రామారావు, రేలంగి, రమణారెడ్డి, ఆర్. నాగేశ్వరరావు, దొరస్వామి, అల్లు రామలింగయ్య, కుసుమ కుమారి, చదలవాడ, సూర్యకాంతం, రాజసులోచన, గిరిజ తదితరులు నటించారు.
రా.వే. కథ కు పినిశెట్టి రచన చేశారు. అనిశెట్టి పాటలు పలికించగా, సుసర్ల దక్షిణామూర్తి బాణీలు కట్టారు. సి.వి.రంగనాథ దాస్ దర్శకత్వం వహించారు. ఇందులోని “ఆలికి మగాడే వశమయ్యే…”, “ఈ వయసు సొగసు…”, “వెన్నెల చలికాంతులలో…”, “నా ఆశలన్నీ…”, “నిదురపోరా…”, “తప్పుడు పనులు…” అంటూ మొదలయ్యే పాటలు అలరించాయి.

యన్టీఆర్ తో అంతకు ముందు ‘సంసారం’ వంటి సూపర్ హిట్ నిర్మించారు సి.వి.రంగనాథదాస్. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. యన్టీఆర్ ను కేవలం అందాల నటునిగా కాకుండా, ఆయనలోని అసలైన ప్రతిభను తెరకెక్కించాలని రంగనాథదాస్ తపించేవారు. ఆ తపనలో రూపొందిన చిత్రమే ‘సంకల్పం’. రిపీట్ రన్స్ లో ఈ సినిమా విశేషాదరణ చూరగొంది.