దాదాపు ఇరవై నాలుగేళ్ళ క్రితం తన ‘ద సిక్స్త్ సెన్స్’తో యావత్ ప్రపంచాన్నీ తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు మనోజ్ నైట్ శ్యామలన్. భారతీయ సంతతికి చెందిన మనోజ్ శ్యామలన్ హాలీవుడ్ లో తనదైన బాణీ పలికించారు. భారతదేశం శ్యామలన్ ను పద్మశ్రీ పురస్కారంతోనూ గౌరవించింది. ఈ యేడాది ‘నాక్ ఎట్ ద క్యాబిన్’ చిత్రంతో జనం ముందుకు వచ్చారు శ్యామలన్. అయితే ఆ సినిమా అంతగా అలరించలేక పోయింది. ఇప్పుడు ఆయన కూతురు ఇషానా నైట్ శ్యామలన్ తండ్రిలాగే మెగాఫోన్ పట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఆమె రచయిత్రిగా కొనసాగుతోంది. ఆమె అక్క సలేకా శ్యామలన్ కూడా గాయనిగా ‘ఆర్ అండ్ బి’తో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇషానా డైరెక్టర్ గా మారబోవడం విశేషంగానే మారింది.
ఇషానా ‘ద వాచర్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఇప్పటికే ‘సర్వెంట్’ అనే టీవీ సిరీస్ కు ఇషానా రచయిత్రిగా, దర్శకురాలిగా సాగింది ఇషానా. కానీ, బిగ్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. భారతీయ సంతతికి చెందిన కుటుంబంలో పుట్టడం ద్వారా మనోజ్ కథల్లో భారతీయత ప్రతిబింబిస్తూ ఉంటుంది. అదే తీరున ఇషానా సైతం తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తన ‘ద వాచర్స్’ కథలో మన భారతీయ పాత్రలను చొప్పించిందట!
Read Also: Harish Rao: దేశం మార్పు కోసమే కేసీఆర్ పోరాడుతున్నారు
ఇందులో మీనా అనే 28 ఏళ్ళ యువతి అనుకోకుండా ఓ అడవిలో చిక్కుకుంటుంది. అక్కడ ఆమెకు ముగ్గురు వ్యక్తులు తారస పడతారు. వారిని కొన్ని రహస్య జీవులు పరిశీలిస్తుంటాయి. మీనా కూడా ఆ ట్రాప్ లో చిక్కుకుంటుంది. ఆ తరువాత ఏమయిందన్నదే ‘ద వాచర్స్’ కథ అని ఇషానా చెబుతోంది. తండ్రి మనోజ్ లాగే ఇషానా కూడా తన కథల్లో అభూత కల్పనలు చొప్పించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది అంటే 2024 జూన్ 7న విడుదల కానుందట. మరి ‘ద వాచర్స్’తో ఇషానా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుందేమో చూడాలి.
Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్