Shruti Haasan: నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిన్న(2026 సెప్టెంబర్ 3న) ఒక కీలకమైన తీర్పునిస్తూ ఆమెకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో ఆమె ముఖాన్ని వాడుకుని సృష్టించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలను ఇంటర్నెట్ నుండి వెంటనే తీసేయాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. గత జూన్ నెలలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్ చేయడమే కాకుండా, ఆమె అనుమతి లేకుండా నకిలీ అకౌంట్ల ద్వారా బ్రాండ్ ప్రమోషన్లు, వస్తువుల అమ్మకాలు కూడా సాగించారు.దీంతో తన పరువుకు భంగం కలిగిస్తూ, తన పేరును తప్పుడు పనులకు వాడుకుంటున్నారంటూ శృతి హాసన్ ఆగస్టులో కోర్టును ఆశ్రయించి, రూ. 15 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశారు.
ఈ కేసును విచారించిన జస్టిస్ మాధవ్ జామదార్.. శృతి హాసన్ వైపు ఉన్న న్యాయాన్ని అంగీకరిస్తూ ఇంటర్నెట్‌లో ఇలాంటి తప్పుడు కంటెంట్ ఉంటే ఆమె ప్రతిష్టకు భర్తీ చేయలేని పెద్ద నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు ఇవ్వడం వల్ల ఈ నష్టం పూడదని, సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవం, గోప్యత అనేవి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలోకి వస్తాయని కోర్టు గుర్తుచేసింది. అందుకే శృతి హాసన్ గుర్తించిన ఆ తప్పుడు లింకులను, వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్‌ఫామ్‌లు వెంటనే డిలీట్ చేయాలని, ఆ నకిలీ అకౌంట్లు నడుపుతున్న వారి వివరాలను బయటపెట్టాలని హైకోర్టు గట్టిగా ఆదేశించింది. ఏఐ దుర్వినియోగం అవుతున్న ఈ రోజుల్లో సెలబ్రిటీల డిజిటల్ భద్రతకు ఈ తీర్పు ఉపశమనం ఇచ్చినట్లయింది.
ఇక నటి శృతి హాసన్ ప్రస్తుతం పలు క్రేజీ పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న భారీ సీక్వెల్ ‘సలార్: పార్ట్ 2’ లో ఆమె మళ్లీ ‘ఆధ్య’ పాత్రలో కనిపించనున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాదినేని తెరకెక్కిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో టీచర్‌గా పాత్ర పోషిస్తుండగా, విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు మిస్కిన్ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ట్రెయిన్’ లో కథానాయికగా నటిస్తున్నారు. వీటితో పాటు తన తండ్రి కమల్ హాసన్‌తో కలిసి ఒక ప్రత్యేకమైన మ్యూజికల్ ప్రాజెక్ట్‌పై కూడా ఆమె వర్క్ చేస్తున్నారు.

