Shruti Haasan: ఇప్పుడు టాలీవుడ్‌లో శ్రుతిహాసన్ టైమ్ నడుస్తోందని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన రెండు పెద్ద సినిమాల్లోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాల్లో సీనియర్ హీరోల పక్కన శ్రుతిహాసన్ ఆడిపాడింది. దీంతో సంక్రాంతి శ్రుతిహాసన్‌దే అన్న చర్చ నడుస్తోంది. అయితే రెండు సినిమాల్లోనూ శ్రుతి పాత్రలు అంత గొప్పగా ఏం లేవనే టాక్ వచ్చింది. ముఖ్యంగా వీరసింహారెడ్డి మూవీలో పట్టుమని పావుగంట పాత్ర కూడా శ్రుతికి దక్కలేదు. కేవలం రెండు, మూడు పాటలకు మాత్రమే ఆమె పరిమితమైంది. అటు వాల్తేరు వీరయ్యలో రా ఆఫీసర్‌గా కొంచెం చెప్పుకోదగ్గ పాత్ర పోషించింది. కానీ పాత్రకు తగ్గ విధంగా ఈ సినిమాలోనూ ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ అయితే లభించలేదు.
Read Also: GO First Airlines: బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా రూ.1199కే విమాన ప్రయాణం
ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలలో తనకు లభించిన పాత్రలపై శ్రుతిహాసన్ తాజాగా స్పందించింది. ఈ రెండు సినిమాలకు తనకు డిఫరెంట్‌గా ప్రశంసలు వస్తున్నాయని అభిప్రాయపడింది. వీరసింహా రెడ్డి సినిమాలో తాను ఎక్కువ సేపు కనిపిస్తానని జనాలు అనుకున్నారని.. అయితే తన పాత్ర చిన్నది అని ముందే తెలిసినా నటించానని వివరించింది. తనకు డైరెక్టర్ గోపీచంద్ చాలా ఏళ్ల నుంచి తెలుసు అని.. ఈ సినిమా మొత్తం కూడా బాలయ్య గారి చుట్టూ తిరుగుతుందని తనకు తెలుసు అని చెప్పింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ సినిమాను చూసి ఫుల్ ఖుషీ అవుతుండటం ఎంతో ఆనందంగా ఉందని శ్రుతిహాసన్ పేర్కొంది. అదే కోవలో చిరంజీవి సర్ అభిమానులు కూడా వాల్తేరు వీరయ్యను చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారని చెప్పింది. చిరు, బాలయ్య అభిమానులను, వారి వారి ఇమేజ్‌లకు తగ్గట్టుగా సినిమాలను తీశారని శ్రుతి చెప్పింది. తాను ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల్లో ఎక్కువగా నటించలేదని.. తెలుగులో మళ్లీ నటిస్తే పెద్ద సినిమాల్లోనే నటించాలని అనుకున్నానని.. అందుకే ఆయా సినిమాల్లో చిన్న పాత్రలైనా నటించినట్లు శ్రుతి చెప్పుకొచ్చింది.