Shraddha Das Trolled For interfering In Anasuya Controversy: గత రెండ్రోజుల నుంచి ట్విటర్‌లో ‘ఆంటీ’ అనే పదం తెగ ట్రెండ్ అవుతోన్న విషయం తెలిసిందే! ‘అమ్మని అన్న ఉసూరు ఊరికే పోదు’ అంటూ గురువారం ఆమె చేసిన ట్వీట్.. ఆ ఆంటీ ట్రెండ్‌కి తెరతీసింది. తమ అభిమాన హీరోనే టార్గెట్ చేస్తావా అంటూ ఓ హీరోకి చెందిన అభిమానులు.. అనసూయను ట్రోల్ చేయడంలో భాగంగా ‘ఆంటీ’ పదాన్ని వినియోగించారు. అందుకు బదులుగా.. ‘పెళ్లై, ఇద్దరు పిల్లలున్నంత మాత్రానా ఆంటీ అని పిలుస్తారా? నేను ఎవ్వరికీ ఆంటీని కాను’ అని అనసూయ రివర్స్ ఎటాక్‌కి దిగింది. తనని ‘ఆంటీ’ అంటూ వేధిస్తున్నందుకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ట్రోలర్స్ మరింత రెచ్చిపోయారు. అంతే.. ‘ఆంటీ ఆంటీ ఆంటీ’ అంటూ నెట్టింట్లో ఒకటే మోత మోగిపోతోంది.
ఈ క్రమంలోనే నటి శ్రద్ధా దాస్ జోక్యం చేసుకొని.. ఒక ట్వీట్ చేసింది. ‘‘మీ వయసులో సగం కన్నా తక్కువగా ఉన్న అమ్మాయిల కంటే మీరే చాలా అందంగా కనిపిస్తారు. అంతేకాదు.. మీకన్నా రెట్టింపు వయసున్నా అంకుల్స్ కంటే మీరే చాలా హాట్‌గా ఉంటారు. మీ అందానికి నేను ఎప్పటికీ అభిమానినే’’ అంటూ శ్రద్ధా ట్వీటింది. నిజానికి.. శ్రద్ధా చేసిన ట్వీట్‌కి ‘ఆంటీ వివాదం’తో ఎలాంటి సంబంధం లేదు. కేవలం ఆమె అందంగా ఉంటుందని, ఆమె అందానికి తాను ఫ్యాన్ అని మాత్రమే శ్రద్ధా ట్వీట్ చేసింది. ఇది అర్థం చేసుకోలేని కొందరు నెటిజన్లు.. అనసూయకు శ్రద్ధా మద్దతు తెలుపుతోందని భావించి, ఆమెని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘ఎప్పుడో ఐదేళ్ల క్రితం, అది కూడా సినిమాలోని డైలాగ్‌ని పట్టుకొని.. అనసూయ అనవసర రాద్ధాంతం చేస్తోంది. అలాంటి ఆమెకు మీరు సపోర్ట్ చేయడమేంటి’’ అంటూ శ్రద్ధాపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలోనే శ్రద్ధా దాస్ ట్రోలర్స్‌కి వివరణ ఇచ్చుకుంది. ‘‘నన్ను దూషిస్తూ మీ సమయాన్ని, శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కేవలం అనసూయ లుక్స్‌ని పొగిడినందుకు నన్ను ట్రోల్ చేయడంలో అర్థం లేదు’’ అని తెలిపింది. అంతేకాదు.. అక్కడ నడుస్తున్న వివాదంలో తాను ఎవరికీ మద్దతు తెలపలేదని, అసలు ఆ ఇష్యూ మీద మాట్లాడే అర్హత తనకు లేదని చెప్పింది. కాకపోతే.. ఇతరులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తేనే తనకు నచ్చదని స్పష్టత ఇచ్చుకుంది. తనని తిడుతూ పెట్టిన ట్వీట్లను డిలీట్ చేస్తానని, అలాగే తిట్టినవారి ఖాతాలను బ్లాక్ చేస్తానని శ్రద్ధా చెప్పుకొచ్చింది. అదన్నమాట.. సంగతి!