దర్శకుడు వి.రామచంద్రరావు తెరకెక్కించిన చిత్రాల సంఖ్య తక్కువే. కానీ, సదరు చిత్రాలతోనూ ఆయన అలరించిన తీరు చాలా ఎక్కువనే చెప్పాలి! కృష్ణను స్టార్ హీరోగా నిలపడంలో రామచంద్రరావు తెరకెక్కించిన “నేనంటే నేనే, అసాధ్యుడు, అమ్మాయిగారు-అబ్బాయిగారు, గంగ-మంగ” వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక యన్టీఆర్ తో కృష్ణ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’, కృష్ణ 100వ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’కు కూడా రామచంద్రరావే దర్శకులు. ‘అల్లూరి సీతారామరాజు’ షూటింగ్ లో ఉండగానే ఆయన కన్నుమూశారు. ఆయన రూపొందించిన “అమ్మమాట, పాపం పసివాడు” చిత్రాలు సైతం అలరించాయి. వాణిశ్రీకి నటిగా మంచి పేరు సంపాదించి పెట్టిన ‘మరపురాని కథ’కూ ఆయనే దర్శకత్వం వహించారు. వి.రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘అమ్మ మాట’ చిత్రంలో శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించారు. ఈ చిత్రం 1972 ఫిబ్రవరి 25న విడుదలై విజయం సాధించింది.
‘అమ్మ మాట’ కథ ఏమిటంటే – పైకి అపరభక్తునిగా నటిస్తూ, లోపల కుట్రలు చేసే వ్యక్తి షావుకారు పుణ్యమూర్తి. అతని వద్ద శ్రీనివాసరావు అనే గుమస్తా ఉంటాడు. అతని భార్య లక్ష్మిపై కన్నేసి, అన్యాయంగా శ్రీనివాసరావును జైలుకు పంపిస్తాడు. లక్ష్మిని బలాత్కరించబోతాడు. అతణ్ణి కొట్టి, ఆ ఊరినుండి పారిపోయి, పిల్లలను రెక్కల కష్టంతో చదివిస్తుంది లక్ష్మి. ఆమె కొడుకు రఘు ఫస్ట్ క్లాస్ లో డిగ్రీ పాసవుతాడు. ఓ కోటీశ్వరుని కూతురు శోభకు ట్యూషన్ చెబుతుంటాడు. ఆమె రఘుపై మనసు పారేసుకుంటుంది. ఈ శోభ మరెవరో కాదు, పుణ్యమూర్తి బావ కూతురే! అందువల్ల ఆమెను తన కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని ఆశిస్తాడు. పుణ్యమూర్తిని చూడగానే రఘు గుర్తు పడతాడు. ఒకప్పుడు ఆ నీచుడే తన తల్లిని బలాత్కరించబోయాడని గుర్తు చేసుకుంటాడు. అతణ్ణి మట్టు పెట్టాలనుకుంటాడు. అయితే అమ్మకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటాడు రఘు. లక్ష్మి కొడుకే శోభను పెళ్ళాడబోతున్నాడని తెలిసిన పుణ్యమూర్తి, జైలు నుండి వచ్చిన శ్రీనివాసరావును కిడ్నాప్ చేసి, ఆ కుటుంబాన్ని మట్టు పెట్టాలని చూస్తాడు. అయితే రఘు సాహసంతో పోరాడి, చివరకు పుణ్యమూర్తి తన కన్నవారి కాళ్ళు పట్టుకొనేలా చేస్తాడు. తనను క్షమించమని కోరుతూనే లాఘవంగా కింద పడ్డ రివాల్వర్ తీసుకొని, రఘును కాల్చబోతాడు. అతను తప్పించుకోగా, అది పుణ్యమూర్తి కొడుక్కే తగులుతుంది. కన్నుమూస్తూ పుణ్యమూర్తి కొడుకు తన తండ్రే ఒకరిని చంపేసి, ఆ నేరాన్ని శ్రీనివాసరావుపై మోపాడని చెబుతాడు. పుణ్యమూర్తి జైలుకు వెళతాడు. రఘు, శోభ పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో సావిత్రి, లీలారాణి, సుజాత, నాగభూషణం, చిత్తూరు నాగయ్య, రాజబాబు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి, జ్యోతిలక్ష్మి, శ్రీదేవి, లత, రాజేశ్వరి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు భమిడిపాటి రాధాకృష్ణ రాశారు. రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చగా, దేవులపల్లి, సినారె, కొసరాజు పాటలు పలికించారు. ఈ చిత్రాన్ని విజయలక్ష్మి మూవీస్ పతాకంపై జి.వి.యస్.రాజు నిర్మించారు.
ఇందులోని “ఎంతబాగా అన్నావు…ఎవ్వరు నేర్పిన మాటరా…”, “ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్…”, “ఎవరైనా చూశారా ఏమనుకుంటారు?…”, “సద్దు మణగనీవోయ్ చందురుడా…” వంటి పాటలు అలరించాయి. అన్నిటినీ మించి ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ “మాయదారి సిన్నోడు… మనసే లాగేసిండు…” పాట ఇప్పటికీ మురిపిస్తూనే ఉంది. రామ్, ఇలియానా తొలి సినిమా ‘దేవదాసు’లో ఈ పాటను రీమిక్స్ చేశారు. అంతలా ఆ పాట అలరించింది. ఆ రోజుల్లో అయితే వాడవాడలా “మాయదారి సిన్నోడు…” పాట మారుమోగింది. ‘అమ్మమాట’ చిత్రం మంచి విజయం సాధించి, శోభన్ బాబు, వాణిశ్రీ జంటకు మంచి పేరు సంపాదించి పెట్టింది.