NTV Telugu Site icon

విలక్షణమే శత్రుఘ్న సిన్హాకు సలక్షణం!

shatrughan sinha

shatrughan sinha

ముక్కుసూటి తనానికి మారుపేరుగా నిలిచారు హిందీ స్టార్ హీరో శత్రుఘ్న సిన్హా! అందుకే ఆయనను బాలీవుడ్ లో అభిమానంగా ‘షాట్ గన్ సిన్హా’ అనీ పిలుస్తుంటారు. ‘బీహారీ బాబు’గానూ ఆయనకు పేరుంది. శత్రుఘ్న సిన్హా తనదైన విలక్షణ అభినయంతో ఆకట్టుకున్నారు. ‘మేధావి’ అనే తెలుగు చిత్రంలోనూ ఆయన నటించారు. తరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘రక్తచరిత్ర’లోనూ శత్రుఘ్న సిన్హా అభినయించారు. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ శత్రుఘ్న సిన్హా రాణించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంలో తెలుగువారి పాత్ర ఎంతో ఉందని పలుమార్లు ప్రకటించి, తెలుగువారి మనసు దోచుకున్నారు శత్రుఘ్న సిన్హా.

శత్రుఘ్న సిన్హా 1945 డిసెంబర్ 9న బీహార్ రాజధాని పాట్నాలో జన్మించారు. ఆయన కన్నవారు భుబనేశ్వరీ ప్రసాద్ సిన్హా, శ్యామాదేవీ సిన్హా. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అంటే ఎంతో గౌరవించే కుటుంబం వారిది. శత్రుఘ్న అన్నదమ్ముల్లో కల్లా చిన్నవాడు. ఆయనకు ముగ్గురు అన్నలు వారి పేర్లు రామ్, లక్ష్మణ్, భరత్. పాట్నా సైన్స్ కాలేజ్ లో బి.ఎస్సీ, చదివిన శత్రుఘ్న సిన్హా, పూనా ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి డిప్లొమా ఇన్ యాక్టింగ్ పూర్తి చేశారు. బొంబాయి చేరి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పటి హిందీ హీరోల్లో చాలామంది తెలుపు రంగులో ఉండేవారు. శత్రుఘ్న సిన్హా గోధుమరంగులో ఉండడమే కాదు, కుడిపెదవి దగ్గర పెద్ద గాటు ఉండేది. దాంతో కొందరు ఆయన ముఖానే సినిమాలకు పనికి రావు అన్నారు. అయినా పట్టుదలతో ముందుకు సాగిన శత్రుఘ్న సిన్హా తొలిసారి ‘ప్యార్ హీ ప్యార్’లో తెరపై కనిపించారు. అయితే అందులో ఆయన పేరు టైటిల్ కార్డ్స్ లో చోటు చేసుకోలేదు. మనోజ్ కుమార్ హీరోగా మోహన్ సెగల్ రూపొందించిన ‘సాజన్’లో ఓ కీలక పాత్ర పోషించారు శత్రుఘ్న సిన్హా. ఇదే ఆయన తొలి సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా, దేవానంద్ ‘ప్రేమ్ పూజారి’లో శత్రుఘ్న పోషించిన పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర నటునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది.

‘మేరే అప్నే’లో వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా పోటీగా నటించారు. అదీ మంచి పేరు తెచ్చింది. మన తెలుగువారు తెరకెక్కించిన చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలు ధరించారు. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి’, ఎల్వీ ప్రసాద్ డైరెక్షన్ లో ‘షాదీ కే బాద్’, తాతినేని ప్రకాశరావు రూపొందించిన ‘రివాజ్’ చిత్రాల్లో శత్రుఘ్న నటించి ఆకట్టుకున్నారు. వినోద్ ఖన్నాతో ‘దో యార్’లోనూ, ‘భాయ్ తో ఐసా’లో జితేంద్రతోనూ, ‘బాంబే టు గోవా’లో అమితాబ్ బచ్చన్ తోనూ, ‘రామ్ పూర్ కా లక్ష్మణ్’లో రణధీర్ కపూర్ తోనూ నటించిన శత్రుఘ్న సిన్హా నటునిగా మంచి మార్కులు సంపాదించారు. తరువాత ‘మిలాప్’లో ద్విపాత్రాభినయం చేసి హీరోగా గ్రాండ్ సక్సెస్ చూశారు. దాంతో శత్రుఘ్న సిన్హాకు స్టార్ డమ్ లభించింది.

“గాయ్ ఔర్ గోరీ, బ్లాక్ మెయిల్, ఆ గలే లగ్ జా, దోస్త్, జగ్గు, అనోఖ, దో థగ్, కాళీ చరణ్, ఖాన్ దోస్త్” వంటి చిత్రాలలోనూ శత్రుఘ్న మంచి పాత్రల్లో కనిపించి, ఆకట్టుకున్నారు. ‘మిలాప్’తో రీనా రాయ్ సరసన నటించిన శత్రుఘ్న సిన్హా ఆ తరువాత కూడా ఆమెతో పలు చిత్రాలలో అభినయించి విజయం చూశారు. అందువల్ల రీనా రాయ్ , శత్రుఘ్న హిట్ పెయిర్ అని చెప్పవచ్చు. అమితాబ్ బచ్చన్ తో శత్రుఘ్న కలసి నటించిన “దోస్తానా, షాన్, నసీబ్” వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. తరువాత దాసరి ‘ఆజ్ కా ఎమ్.ఎల్.ఏ. రామ్ అవతార్’, కె.రాఘవేంద్రరావు ‘హోషియార్’ లోనూ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘ఓ ఆద్మీ బహుత్ కుఛ్ జాన్తా థా’ అనే చిత్రంలో నటిస్తున్నారాయన.

శత్రుఘ్న సిన్హాకు ఆ రోజుల్లో విశేషమైన క్రేజ్ ఉండేది. అప్పట్లో మిస్ ఇండియాగా ఎన్నికైన అందాల పూనమ్ ను ప్రేమించి 1980లో పెళ్ళాడారు. వారికి లవ్-కుశ్ అనే ఇద్దరు అబ్బాయిలు, సోనాక్షి సిన్హా సంతానం. తండ్రి బాటలోనే లవ్ సిన్హా సినిమా రంగంలో, ఆ తరువాత రాజకీయ రంగంలో కాలుమోపాడు. సోనాక్షి సిన్హా ‘దబంఘ్’ బ్యూటీగా జేజేలు అందుకుంది.

తొలి నుంచీ హిందుత్వను అభిమానించే కుటుంబం కావున, శత్రుఘ్న సిన్హా భారతీయ జనతా పార్టీలో సాగారు. 1996 నుండి 2008 వరకు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు శత్రుఘ్న. అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో కుటుంబ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. 2009, 2014 ఎలక్షన్లలో పాట్నా సాహిబ్ నుండి రెండు సార్లు వరుసగా లోక్ సభకు ఎన్నికయ్యారు. బీజేపీ అధిష్టానం వైఖరి నచ్చక, విమర్శలు చేసి తానే స్వచ్ఛందంగా బయటకు వచ్చారు శత్రుఘ్న సిన్హా. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శత్రుఘ్న సిన్హా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.