శర్వానంద్ హీరోగా హీరో శ్రీవిష్ణు కామియో చేసిన లేటెస్ట్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’,ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న హీరో శర్వానంద్, శ్రీవిష్ణు వ్యక్తిత్వం గురించి, ఆయనకున్న సినిమా పట్ల నిబద్ధత గురించి గొప్పగా మాట్లాడారు. దర్శకుడు రామ్ అబ్బరాజుతో శ్రీవిష్ణుకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే, గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సామజవరగమనా’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ గౌరవంతోనే, ఈ సినిమాలో శ్రీవిష్ణు ఒక చిన్న అతిథి పాత్ర చేయడానికి వెంటనే అంగీకరించారని శర్వానంద్ పేర్కొన్నారు.
Also Read:Tollywood Heros: టాలీవుడ్ కొత్తతరం హీరోలు.. నటులే కాదు స్టోరీ సృష్టికర్తలు కూడా!
ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. “శ్రీవిష్ణు సింప్లిసిటీని మనం కచ్చితంగా మెచ్చుకోవాలి. సినిమా మీద, దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో ఒక చిన్న పాత్ర చేయడానికి ఆయన ఒప్పుకోవడం మామూలు విషయం కాదు. నిజాయితీగా చెప్పాలంటే, అదే పొజిషన్ లో నేను ఉండి ఉంటే.. నన్ను ఎవరైనా అలా చేయమని అడిగితే నేను చేసేవాడిని కాదేమో, కానీ శ్రీవిష్ణు ఏమాత్రం ఆలోచించకుండా ముందుకు రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం” అని ప్రశంసించారు. సాధారణంగా ఫామ్‌లో ఉన్న హీరోలు చిన్న పాత్రలు చేయడానికి వెనకాడతారు. కానీ శ్రీవిష్ణు మాత్రం కథను, దర్శకుడిని నమ్మి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోటి హీరోని అంతలా గౌరవిస్తూ శర్వానంద్ మాట్లాడటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన నారి నారి నడుము మురారి మంచి టాక్ సాధించింది.
